కష్టపడి పైకి వస్తే వచ్చే కిక్ అందరికీ దక్కేది కాదు, అందులో ఉన్న మజా అనుభవించితేనే తెలుస్తుంది. ప్రస్తుతం ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ అలాంటి కిక్ నే అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పృధ్వీ, అమాంతంగా డబ్బులు తెచ్చుకుని, కళ్ళు నెత్తికెత్తికెక్కిన ‘జబర్దస్త్’ కమెడియన్లను గురించి తాజాగా ఏకిపారేసారు. ఇందుకు తన స్వీయ అనుభవమే కారణంగా, అక్కడ జరిగిన ఉదంతాలను ప్రస్తావించారు పృధ్వీ.
శ్రీకాకుళం జిల్లాలో ఓ కార్యక్రమానికి ‘జబర్దస్త్’ కమెడియన్ రాఘవ హాజరు కావాల్సి ఉందని, కానీ, అతను రాలేక వేరే వారిని పంపించారని, విశాఖ ఎయిర్ పోర్టులో నేనే స్వయంగా రిసీవ్ చేసుకున్నానని, అయితే అక్కడ వారి ప్రవర్తన చూసిన తర్వాత అసహ్యం వేసిందని చెప్పుకొచ్చారు. కారెక్కి బీర్లు లేవా, ఏదైనా ధాబా దగ్గర ఆపండి బీర్లు కొనుక్కుందాం అంటూ… కారు ఆపించి, బీర్లు కొనుక్కుని తాగి, అక్కడున్న వారితో ఫోటోలు దిగి, ఆర్టిస్టులంటే గౌరవం పోయేలా ప్రవర్తించారని మండిపడ్డారు.
అయాచితంగా వచ్చిన డబ్బు వలన వీరు ఇలా ప్రవర్తిస్తున్నారని, కష్టపడితే ఆ విలువ తెలుస్తుందని అన్న పృధ్వీ, ఇలాంటి వారంతా రేపు ఇండస్ట్రీకి వస్తే సర్వనాశనం కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఒకడేమో… ఈ మధ్యన నిన్ను చూస్తున్నాం అంటూ మాట్లాడారని, తనను చూడాలంటే తన వెనుక 20 సంవత్సరాలు చూడాలని అంటూ ఆగ్రహించిన పృధ్వీ, వీళ్ళు ఇచ్చే బిల్డప్ లు చూస్తుంటే అసహ్యం వేసిందని, అర్ధరాత్రి 2 గంటలకు లేచి ‘ఆమ్లేట్లు లేవా?’ అని అడిగారని, ఇక్కడ జబర్దస్త్ అనుకున్నారా? ఏమనుకున్నారా? అని ప్రశ్నించారని వారి ప్రవర్తనను తూర్పారబట్టారు.
అయితే ఆ ‘జబర్దస్త్’లో గెటప్ శీను, హైపర్ ఆది, చంద్ర, తిరుపతి ప్రకాష్ వంటి వారు మాత్రం వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారని, కనీసం వాళ్ళను చూసైనా నేర్చుకోవాలని, వీళ్ళ ప్రవర్తన మారాలని, అందుకే ఇలా మాట్లాడుతున్నానని, శ్రీకాకుళం జిల్లాలో ‘జబర్దస్త్’ అన్న పేరు వింటేనే అసహ్యం వేసేలా కలిగించారని, వీరి వ్యక్తిత్వం చూసి కళామ్మ తల్లి కూడా ఎటో వెళ్ళిపోతుందని మండిపడ్డారు. ఇక్కడున్న నటులు కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ వంటి వారి ముందు తాము వెంట్రుక ముక్కకు పనికి రామని, అయితే వారిని చూసి నేర్చుకుంటున్నామని, వీళ్ళు ఇప్పుడు కార్లు దిగి కోట ఏంటమ్మా అని మాట్లాడితే… అంటూ చెప్పారు గానీ, ఆ కమెడియన్ల పేరు మాత్రం బయటకు వెల్లడించలేదు.



