ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో టీడీపి వెంటనే స్పందిస్తూ, షో కాజ్ నోటీస్ జారీ చేసింది. మీ కార్యకలాపాల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగింది కనుక లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని, పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవకాశం కోసమే ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కనుక వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు హడావుడిగా మీడియా ముందుకు వచ్చేసి, “దేశ చరిత్రలో ఓ ఎంపీ మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడటం ఇదే మొదటిసారి. ఇది పుట్టా మహేష్‌తోనే ఆగదు…” అంటూ మరో పేరు చెప్పబోతే స్క్రిప్టులో లేదు. దాంతో ఎవరి పేరు చెప్పాలో తెలియక ‘ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లనే… మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి ఆయన సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం,” అంటూ జగన్ ముగించారు.
ఈ విషయం చెపుతున్నప్పుడు జగన్ కళ్ళలో ఆనందం కనిపించింది. ఇది అల్ప సంతోషమే కావచ్చు. కానీ ఈ సమయంలో ఇదీ చాలా అవసరమే. కనుక ఈ అల్ప సంతోషం కలిగించినందుకు అయన పుట్టా మహేష్‌కి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.
అయితే ఏకంగా 11 అక్రమాస్తుల కేసులు మొదలు మద్యం కేసుల వరకు ఎన్ని కేసులలో తన పేరు ఉందో జగన్ మరిచినట్లు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తనని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి తలుచుకుంటే ఇప్పుడు తాను ఎక్కడ ఉండేవాడిని? అప్పుడు వైసీపీ పరిస్థితి ఏమిటి? అని జగన్ ఆలోచిస్తే వాస్తవికతకు దగ్గదరా ఉండేది.




