ఆప్ పంజాబ్ రాజ్యసభ నేత రాఘవ్ చద్దా ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో చాల విస్తృతంగా ప్రచారంలో ఉంటుంది. సామాన్యుడి కోసం గళం వినిపించే రాజకీయ నేతగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాఘవ్. చట్ట సభలంటే అధికార – ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చలే తప్ప ప్రజా సమస్యల ఊసే ఉండదు అనే వారికి రాఘవ్ తన రాజకీయంతో చక్కటి సమాధానం చెపుతున్నారు.
* ముఖ్యంగా రాఘవ్ పార్లమెంట్ లో లేవనెత్తే సమస్యలు అన్ని సామాన్యుడి స్వరం లా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు బ్యాంకు లు మినిమం అకౌంట్ బాలన్స్ అంటూ నిబంధనలు పెట్టి ఆ మొత్తం అకౌంట్ లో లేకపోతే ఖాతాదారులను జరిమానాల పేరుతో దోచుకోవడం అన్యాయం అంటూ గొంతెత్తి బ్యాంకులు ఆ నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేసారు.
* అలాగే ప్రతి రాజకీయ పార్టీలు కూడా అయితే పేదల కోసం లేకుంటే ధనికుల కోసం పథకాలు ప్రవేశపెడతారు కానీ మధ్యతరగతి ప్రజల సంగతి పట్టించుకోరు అని బలంగా ఆ వర్గం ఆవేదనను పార్లమెంట్ సాక్షిగా యావత్ దేశానికి వినిపించారు.
* అలాగే తాజాగా స్పీడ్ డెలివరీల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలు గిగ్ వర్కర్ల ప్రాణాలతో వ్యాపారం చేస్తుందంటూ వారి సమస్యల పై ప్రభుత్వంతో పోరాడారు. అలాగే ఈక్విటీ వంటి పెట్టుబడుల పై లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ టాక్స్ ని నిలిపివేయాలని వాదించారు.
* ఇక దేశంలో కలుషితం అవుతున్న ఆహార పదార్ధాల పై కూడా చద్దా చాల బలమైన వాదనను ఆధారాలతో సహా సభలో ప్రసంగించారు, అలాగే అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన జాగ్రత్తలు సైతం తెలియచెప్పారు. మంత్లీ ప్లాన్స్ అంటూ టెలికాం ఇండస్ట్రీ సామాన్యుడిని ఎలా దోచుకుంటుందో లెక్కలతో, అందరికి అర్ధమయ్యే ఉదాహారణలతో చక్కగా విశదీకరించారు.
* పసిపిల్లలకు పట్టే పాలు నుంచి వాటర్, హౌస్ రెంట్, కరెంటు ఇలా ప్రతి ఒకటి నెలకు 30 లేదా 31 రోజుల చిట్టా పొద్దుతో వస్తుంది. కానీ ఒక్క మొబైల్ రీఛార్జ్ లు మాత్రమే నెలకు 28 రోజుల గడువుతో వినియోగదారున్నీ దోచుకుంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
* అలాగే వినియోగదారుడు ఏదైనా కారణంతో మొబైల్ రీఛార్జ్ చేయని పక్షంలో సదరు టెలికాం సంస్థలు కేవలం అవుట్ గోయింగ్ కాల్స్ వరకు మాత్రమే బ్లాక్ చెయ్యాలి, కానీ అలా కాకుండా యూజర్ ఇన్ కమింగ్ కాల్స్ ని కూడా సంస్థలు నిలిపివేయడం, ఓటీపీ, బ్యాంకు నోటిఫికేషన్ వంటి కీలక సమాచారాన్ని సైతం సదరు సంస్థలు బ్లాక్ చేస్తున్నాయంటూ, ఇది అన్యాయమని ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యల నియంత్రణకు ముందుకు రావాలంటూ సూచించారు.
* ఇక ఇప్పుడు మరో సామాన్యుడి సమస్యతో చట్టసభలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు చద్దా. టెలికాం కంపెనీలు డైలీ డేటా లిమిట్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని, మనం డబ్బు కట్టి కొనుగోలు చేసుకున్న డేటా ఆ రోజుకి వాడకుండా ఉంటే దానిని మరుసటి రోజుకి సదరు యూజర్ ఖాతాకు బదిలీ చెయ్యాలని,
* అలాగే ఆ వినియోగదారుని మిగులు డేటా విలువను తరువాతి రీఛార్జ్ లో మినహాయించుకోవాలని లేని పక్షంలో ఆ డేటాను యూజర్ తన ఇష్టానుసారంగా ఇతర వ్యక్తులకు బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేసారు. ఇలా 38 సంవత్సరాల రాఘవ్ చద్దా దశాబ్దాల నాటి సామాన్యుడి ఆవేదనను చట్ట సభల సాక్షిగా వినిపిస్తూ సామాన్యుడి స్వరమయ్యారు.
ప్రజా సమస్యల పై పూర్తి అవగాహన, ఆ సమస్య పరిష్కారం కోసం చిత్తసుద్ది ఉన్న నిజమైన రాజకీయ నాయకుడిగా రాఘవ్ చద్దా తన ప్రసంగాలతో, తన ప్రశ్నలతో ముఖ్యంగా యువత మనసు దోచుకుంటున్నారు. నేటి భావిభారతానికి అవసరమైన నిజమైన రాజకీయ నేతకు నిలువెత్తు నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో ప్రసంశలు అందుకుంటున్నారు.




