మోడీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్‌పై ఒత్తిడి తెచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో ఓట్ల దొంగతనాలు చేస్తోందని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నారు. ఓటర్ జాబితా ప్రక్షాళన పేరుతో బీజేపిని వ్యతిరేకించే ఓటర్లను జాబితాలలో నుంచి తప్పించేసి, ఎక్కడో రాజస్థాన్, కర్ణాటకలో ఉన్న ఓటర్లను చేర్చుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆయన స్పూర్తితో కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు.
కానీ కేసీఆర్ హయంలో తెలంగాణ అంతటా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఓట్ల చోరీ అంశం చాలా క్యాచీగా ఉన్నందున జగన్ కూడా నేడో రేపో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. బహుశః దానికి రిహార్సల్స్ చేస్తున్నారేమో?
బీహార్‌లో ఓటర్ జాబితాల ప్రక్షాళన చేస్తేనే రాహుల్ గాంధీ గోలగోల చేసేశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమీషన్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలు ప్రక్షాళన చేయబోతోంది. అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టేసింది కూడా. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకునేందుకే ప్రధాని మోడీ ఈ భారీ కుట్ర చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ గోలగోల చేయడం, ఆయనకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వంత పాడటం ఖాయమే. ఖాయమే.
దేశంలో ఈవీఎంలతోనే చాలా మాయలు, మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు, ఈ ఓట్ల చోరీ కూడా తోడయితే ఇక ఎవరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓట్లు వేయాల్సిన అవసరం ఉండక పోవచ్చు. ఎన్నికలలో పోటీ చేసేవారు ఎంతో కొంత ముట్టజెప్పితే, వారికి ఓటరు కార్డు ఇచ్చేస్తే వాళ్ళే ఓట్లు వేసుకునే ఫెసిలిటీ త్వరలో వచ్చినా రావచ్చు.






