ఎన్నాళ్ళు ఉంటారో గానీ… హంగామా మాత్రం అదిరిపోతోంది..!

Kumaraswamy - Rahul - gandhiపలు ఉత్కంఠ పరిణామాల తర్వాత బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలువురు ప్రముఖ నేతలు హాజరు కాబోతున్నారు. ప్రతిపక్ష నేతలు భారీగా హాజరుకానున్న ఈ వేడుక మరో ఆశ్చర్యకర, ఆసక్తికర ఘటనకు వేదిక కానుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది.

కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేశ్ యాదవ్, మాయావతి హాజరు కానున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇంకా డైలమాలో ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ రాలేని పక్షంలో కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉందనే చెబుతున్నారు.

ADVERTISEMENT

సరిగ్గా ఇదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి అన్యాయం చేసిందని వీలుదొరికినప్పుడల్లా కాంగ్రెస్‌పైనా, సోనియాగాంధీపైనా చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు. అలాగే కేసీఆర్ కనుక హాజరైతే… ఆయన కూడా సోనియాను పలకరించక తప్పదు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌.. సోనియా ఒకే వేదికను పంచుకోనున్నారు.

అలాగే నిప్పు-ఉప్పులా ఉండే చంద్రబాబు-కేసీఆర్‌లు కూడా విష్ చేసుకోక తప్పని పరిస్థితి. ఇక ఉత్తరప్రదేశ్‌లో నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఎస్పీ-బీఎస్పీ మధ్య గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల సందర్భంగా మైత్రి కుదిరింది. అఖిలేశ్-మాయావతి పొత్తుపెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వారి పొత్తుతో గోరఖ్‌పూర్‌లో బీజేపీ చిత్తైంది. ఆ తర్వాత అఖిలేశ్ స్వయంగా మాయాను కలిసి అభినందించారు కూడా.

వచ్చే ఎన్నికల్లోనూ వీరి పొత్తు కొనసాగే అవకాశాలున్నాయి. అఖిలేశ్-మాయావతి కూడా ఇదే వేదికపై కనిపించనున్నారు. సో… కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఇంతమంది నేతలను ఒక్క చోటుకి చేరుస్తోంది. అంటే.. రేపు రాజకీయాల్లో సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతం కానుందన్న మాట. ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉంటారో చెప్పలేం గానీ, ఈ హంగామా మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories