కాంగ్రెస్‌ దూరంగా ఉంది… మంచిదే!

Congress Party

జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచింది. దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందని అందరూ భావించినప్పటికీ అది చేరలేదు. బయట నుంచి మద్దతు ప్రకటించింది.

జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా వాద్రా హాజరయ్యారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికరమైన వ్యాక్యలు చేశారు.

“జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవి అంటే ముళ్ళ కిరీటం ధరించడమే. జమ్మూ కశ్మీర్‌కి మళ్ళీ రాష్ట్ర హోదా సాధించడం, ప్రత్యేక ప్రత్యేక హోదా సాధించడం మా ప్రాధాన్యతలు. వాటి కోసం కేంద్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి చేస్తూనే ఉంటాము,” అని అన్నారు.

పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాదుల ప్రభావంలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ చేజారిపోకుండా కాపాడుకునేందుకే కేంద్ర ప్రభుత్వం దానిని మూడుగా విభజించాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా రద్దు చేయాల్సి వచ్చింది.

కనుక ఫరూక్ అబ్దుల్లా చెప్పిన్నట్లు ఆ రెండింటి కోసం పట్టుపట్టాలనుకుంటే జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటంగానే మారుతుంది.

ముఖ్యంగా ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం వేర్పాటువాదులకు దూరంగా ఉండటమే కాకుండా వారి పట్ల కటినంగా వ్యవహరించడం చాలా అవసరం. కానీ జమ్మూ కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలు మొదటి నుంచి వేర్పాటువాదులకు, పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరిస్తుండటం వలననే దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ వేర్పాటువాదం తలెత్తడం ఖాయమే అని భావించవచ్చు. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వంలో చేరకుండా దూరంగా ఉండి ఉంటుంది. కానీ అది చాలా మంచి నిర్ణయమే. లేకుంటే ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, వైఫల్యాలకు కాంగ్రెస్ పార్టీ కూడా సమాన బాధ్యత వహించాల్సివస్తుంది.

ముఖ్యంగా ఉమర్ అబ్ధుల్లా ప్రభుత్వం భారత్‌ సార్వభౌమాత్వానికి లోబడి పనిచేస్తూ జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ వేర్పాటువాదం తలెత్తకుండా అడ్డుకుంటుందో లేదో రాబోయే రోజుల్లో చూడబోతున్నాము.

ADVERTISEMENT
Latest Stories