రెడ్డి గారి చురచురలన్నీ మంత్రి పదవి కోసమేనా.?

Komatireddy Rajagopal Reddy criticizing Revanth Reddy government in Telangana Assembly

తెలంగాణ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత వైరాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. అయితే రేవంత్ సర్కార్ ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ క్యాబినెట్ లో స్థానం కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఆ అవకాశం లభించకపోవడంతో సమయం చిక్కినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పడేసేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.

అలాగే తనకు మంత్రి పదవి కావాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అటు పార్టీ అధిష్టానం పెద్దలకు తన విజ్ఞప్తులు, బెదిరింపులను బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయినా కూడా అటు అధిష్టానం కానీ ఇటు సీఎం రేవంత్ కానీ ఆయన వ్యవహారాన్ని అంత సీరియస్ గా పరిగణించడం లేదనే చెప్పాలి.

ADVERTISEMENT

దీనితో ఇక రాజగోపాల్ నైరాశ్యంకు అసెంబ్లీని వేదిక చేసుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ సర్కార్ పై తనకున్న అసంతృప్తి, అక్కసు వెళ్లగక్కేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కేవలం మంత్రుల నియోజకవర్గాలకే బిల్లు చెల్లిస్తుందని, ఇది ప్రభుత్వ వివక్ష కాదా అంటూ ప్రశ్నించారు.

అసలు ఎమ్మెల్యేలు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారా.? ఎమ్మెల్యే లు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాలా.? వారిని దేహి అంటూ అభ్యర్దించాలా.? అంటూ రేవంత్ సర్కార్ పై తన నిరసనను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొండగల్ ను అభివృద్ధి చేసుకున్నట్టుగా మేము మా నియోజకవర్గమైన మునుగోడు ని డవలప్ చేసుకోవాలని ఆశించడం నేరమా.? ప్రభుత్వ నిధులన్నీ ఒక్క ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని ప్రచారం జరుగుతుంది.

ఇలా సొంత పార్టీలోనే ఎమ్మెల్యే లకు మంత్రులకు మధ్య ఈరకమైన వివక్ష చూపించడం ప్రభుత్వ పెద్దలకు తగునా అంటూ రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై చురకలు అంటించే ప్రయత్నం చేసారు.

అయితే గత కొద్దీ రోజులుగా తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మంత్రి పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో తమ్ముడు రాజగోపాల్ కి అవకాశం కల్పించి రాజగోపాల్ మంత్రి పదవి ఆశను, పార్టీ వ్యవహారాల పై ఆయనకున్న అసంతృప్తిని చల్లారుస్తారంటూ తెలంగాణ రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ, కోమటిరెడ్డి రాజగోపాల్ ఆశలకు ఇప్పట్లో అవకాశం లభించేలా కనిపించడం లేదు. అందుకే ఇక రాజగోపాల్ ఇటు రేవంత్ రెడ్డి తో అటు అధిష్టానంతో తాడోపేడో తేల్చేందుకు ఈ రకముగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పై ప్రభుత్వ మంత్రుల పై విమర్శలతో రెచ్చిపోయారా అంటూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories