ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసుని కొట్టివేయాలని హైకోర్టుని ఆశ్రయించగా చుక్కెదురయ్యింది. ఆ కేసు కొట్టివేయలేము కానీ అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్లయితే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది.
హైకోర్టు సూచన మేరకు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానిపై నేడు విచారణ జరపనుంది. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదో నేడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో చెప్పేశారు. విచారణకు హాజరైతే పోలీసులు ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగిస్తారనే అనుమానంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంటే పోలీసులతో లాఠీ దెబ్బలు తప్పవని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారంటే, తాను చేసిన నేరం ఎటువంటిదో ఆయనకు అవగాహన ఉందన్న మాట!
ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా విడుదల చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను ఉద్దేశ్యించి రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని కనుక తనని ఎవరూ టచ్ చేయలేరనే ధీమాతోనే రాంగోపాల్ వర్మతో సహా వైసీపిలో పలువురు రెచ్చిపోయారు.
కానీ పరిస్థితులు తారుమారు అయ్యి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల నుంచి నోటీసులు వస్తుంటే విచారణ పేరుతో స్టేషన్‌కి పిలిచి తోలు తీస్తారేమో అనే భయం పట్టుకుంది. ఆనాడే ఈ భయం, ఆలోచన ఉండి ఉంటే నేడు ఇంత భయపడాల్సిన అవసరమే ఉండేది కాదుగా?
హైకోర్టు రాంగోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఆహ్వాన పత్రికని రద్దు చేయలేమని ముందే చెప్పేసింది. కనుక ముందస్తు బెయిల్ లభించినా రాంగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టక తప్పదు.
ఆనాడు ముంబై తాజ్ హోటల్‌పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి, పలువురిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేసినప్పుడు యావత్ దేశ ప్రజలు షాక్ అయ్యారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం హోటల్ అంతా కలియ తిరిగి చూసి ఆ సన్నివేశాలను తన సినిమాలో ఏవిదంగా వాడుకోవాలా అని చూశారు. కనుక ఇప్పుడు కూడా అలాగే పోలీస్ స్టేషన్‌లో తనకు ఎదురయ్యే అనుభవంతో మరో సినిమా తీసుకోవచ్చు కదా?




