థియేటర్ కొచ్చిన ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి కథైనా తీసుకోవచ్చు. కేవలం స్టార్ హీరోలతోనే వర్కౌట్ అవుతుందనే రూల్ లేదు. ఆ మాటకొస్తే కొత్తవాళ్లతో ట్రై చేసినా హిట్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అలాంటిది అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నాగశౌర్యతో ఈజీగా మెప్పించవచ్చనే నమ్మకంతో దర్శకుడు పవన్ బసంశెట్టి రంగబలి స్టోరీ రాసుకున్నాడు.
ప్రమోషన్లు గట్రా గట్టిగా చేశారు. కమెడియన్ సత్య ఇంటర్వ్యూ వైరలయ్యాక జనాల దృష్టి దీని మీద పడింది. రంగబలి టీమ్ మొన్నో ఛానల్ లో తమ మీద తామే జోకు వేసుకుంది. రంగస్థలంలో సగం, బాహుబలిలో సగం టైటిల్ ఎత్తుకుని దీనికి పెట్టారాని. అది నిజం కాకపోవచ్చు కానీ కథ మాత్రం అదే బాపతే.
మెడికల్ షాప్ నడుపుకునే ఓ మధ్యతరగతి తండ్రి పుత్రరత్నం మన శౌర్య అలియాస్ షో(నాగ శౌర్య). బిఫార్మసీ చదవాలని వైజాగ్ వెళ్లి అక్కడ హీరోయిన్ ప్రేమలో పడతాడు. పెళ్లి చేయాలంటే నువ్వెళ్ళి మీ ఊరి రంగబలి సెంటర్లో ఫలానా ఘనకార్యం చేసిరమ్మని పురమాయిస్తాడు ఆమె తండ్రి. సరేనని శౌర్య బరిలో దిగడం జరిగిపోతాయి.
కామెడీని నమ్ముకోవడం తప్పేమి కాదు. అలా అని సగం సినిమా దాంతోనే టైం పాస్ చేయించి ఒక్కసారిగా కమర్షియల్ మోడ్ లోకి దిగకూడదు. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తిగా సత్య భుజాల మీదే భారం నెట్టేసిన పవన్ బసంశెట్టి కనీసం జోకుల్లో కూడా ఫ్రెష్ నెస్ చూపించలేకపోయాడు. కేవలం సత్య టైమింగ్ నెట్టుకుంటూ వచ్చిందే తప్ప అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి పూర్తిగా నచ్చేది కాదు.
డబుల్ మీనింగ్ డైలాగులు, ఓ పాటలో హీరోయిన్ ఎక్స్ పోజింగ్ తో ఏదో మాస్ ని టార్గెట్ చేయబోయి దారి తప్పేస్తాడు. మాస్ సినిమాలకు సెకండ్ హాఫ్ చాలా కీలకం. పవన్ సరిగ్గా ఇక్కడే చేతులెత్తేశాడు. చాలా కీలకమైన హీరో విలన్ క్లాష్ ని చప్పగా మార్చి ఏ దశలోనే దాన్ని ఇంటరెస్టింగ్ కాంఫ్లిక్ట్ గా చెప్పలేకపోయాడు.
రేసు గుర్రంలో బన్నీ, బ్రహ్మానందంలు ఎంత కామెడీ చేసినా ముఖేష్ ఋషి విలనీ, రవి కిషన్ సైకో తత్వం సరిగ్గా పేలాయి కాబట్టే జనానికి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఫ్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ ని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేయబోయి ఆ ట్రాక్ మొత్తం ఎప్పుడో తాతల కాలం నాటి ఫిలింగ్ కలిగిస్తాడు.
ఏదో సత్య చలవతో ఎంత చీప్ జోకులున్నా ఫస్ట్ హాఫ్ ని క్షమించినా రెండో సగం మాత్రం నీరసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి క్లైమాక్స్ అయ్యేసరికి ఒంట్లోని ఓపికంతా లాగేస్తుంది. అంత నిస్సత్తువగా గడిచిపోయింది. నాగశౌర్య కష్టపడ్డాడు కానీ అదంతా ఒలికిపోయిన సేంట్ బాటిల్ అయిపోయింది. యుక్తి తరేజా లుక్స్ వరకే బాగుంది. మురళీశర్మతో మొదలుపెట్టి శుభలేఖ సుధాకర్ దాకా అందరివీ టెంప్లేట్ పాత్రలే. పవన్ సిహెచ్ సంగీతం ఏ మాత్రం ఉపయోగపడలేదు. దర్శకుడి మితిమీరిన కమర్షియల్ పైత్యానికి ప్రేక్షకులు బలవ్వడం తప్ప ఒరిగింది ఏమీ లేదు.



