తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. అవి చిలికి చిలికి చివరికి ముఖ్యమంత్రి రేవంత్, ఆయన కుటుంబం టార్గెట్ గా బయటకొస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ పై, ఆయన సోదరుల పై చేసిన అవినీతి ఆరోపణలు ఎంత సంచలనంగా మారాయో ఆ వ్యాఖ్యల పై మంత్రుల మౌనం కూడా అంతే చర్చనీయాంశంగా మారింది.
సుస్మిత తన టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డే అని స్పష్టం చేసినప్పటికీ, మంత్రి సురేఖ తనకు తన కుమార్తె వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించినప్పటికీ రేవంత్ కేబినెట్ లోని మంత్రులెవ్వరు అటు సీఎం రేవంత్ కి కానీ ఇటు మంత్రి సురేఖకు కానీ మద్దతుగా కానీ వ్యతిరేకంగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.
పార్టీలో ఇకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మీడియా ముందుకొచ్చి రేవంత్ కి మద్దతుగా ప్రకటనలు చేస్తూ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలంటూ డిమాండ్ చేసారు కానీ ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ఉప ముఖ్యమంత్రి సీఎం కి అనుకూలంగా కనీసం సుస్మిత వ్యాఖ్యలను ఖండించడానికి కూడా ముందుకు రావడం లేదు.
ముఖ్యంగా రేవంత్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి సీతక్క కానీ మంత్రి పొంగులేటి కానీ మంత్రి జూపల్లి, మంత్రి తుమ్మల….ఇలా రేవంత్ అనుకూల వర్గంగా పేరుపొందిన నేతలు కూడా సుస్మిత వ్యాఖ్యల పై పెదవి విప్పలేదు. ఇక పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం, మంత్రి శ్రీధర్ బాబు వంటి నేతలు కూడా ఈ వివాదంలో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
పార్టీలో మంత్రి పదవి లో ఉన్న సురేఖ కుమార్తె ఏకంగా రాష్ట్ర సీఎం మీదే విరుచుకుపడుతుంటే కనీసం స్పందించాల్సిన బాధ్యత మంత్రులకు లేదా.? సుస్మిత వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం లేదా.? రేవంత్ కి మద్దతుగా మాట్లాడడం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినట్టే అన్న సంగతి మంత్రులు విస్మరిస్తున్నారా.? అధిష్టానం అంటే గౌరవం ఉంది కానీ పార్టీ సీఎం అంటే మర్యాద అవసరం లేదా.?
మంత్రుల మౌనం వెనుకున్న ఆ అంతార్ధం ఏమిటన్నది ఇక్కడ రేవంత్ అభిమానులను కలచివేస్తుంది. రేవంత్ ఒంటరి పోరాటమే వీరికి మంత్రి పదవుల లభ్యత అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీని పదేళ్ల తరువాత రేవంత్ అధికారంలోకి తెచ్చారని, అందుకు పార్టీ అధిష్టానం రేవంత్ కు ఇచ్చిన గౌరవమే రేవంత్ ముఖ్యమంత్రి పదవి అని అటువంటి పార్టీ అధిష్టాన గౌరవాన్ని పార్టీ నేతలే విస్మరిస్తే, విమర్శిస్తే ఎలా అనేది రేవంత్ వర్గం ఆవేదన.





