ఏ ముహూర్తాన పుష్ప – 2 చిత్రం విడుదలయ్యిందో తెలియదు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ చిత్రం చుట్టూ ఎదో ఒక వివాదం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. నాడు తెలంగాణలోని సంధ్యా థియేటర్ ఘటనతో మొదలైన ఈ పుష్ప రాజకీయ రచ్చ ఇప్పుడు ఏపీలోని వైసీపీ సత్తెనపల్లి యాత్ర వరకు కొనసాగుతూనే వస్తుంది.
ఈ నెల 18 న జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా వైసీపీ క్యాడర్ తీసుకొచ్చిన ఒక పోస్టర్ తో పుష్ప చిత్రం మరొకసారి వివాదాల వేదికెక్కింది. 2024 లో మేము అధికారంలోకి వస్తే, “గంగమ్మ జాతరలో గొర్రెలు, మేకలు తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని” అంటూ వైసీపీ శ్రేణులు పోస్టర్లతో నడిరోడ్డు మీద నానా హంగామా చేసారు.
అయితే ఇటువంటి హింసా రాజకీయ ప్రవర్తనను పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఖండించాల్సిన వైస్ జగన్ అందులో తప్పేముంది అంటూ మాట్లాడడం, అది పుష్ప సినిమాలో డైలాగ్, కనీసం సినిమాలో డైలాగ్ చెప్పుకునే స్వేచ్ఛ కూడా వైసీపీ శ్రేణులకు లేదా.? ఏపీలో ఆ మాత్రం డెమోక్రసి లేదా.? అంటూ మీడియా సమావేశం పెట్టి మరి అటువంటి వారిని ప్రోత్సహించారు.
దీనితో సినిమాలో డైలాగ్స్ కేవలం థియేటర్ల వరకు మాత్రమే పరిమితమవ్వాలి, అంతే కానీ వాటిని రోడ్ల మీదకు తెచ్చి ఎవరినో భయపెట్టాలని, మరెవరినో బెదరించాలని చూస్తే చట్టం తన పని తానూ చేసుకుంటూ పోతుంది అంటూ ఏపీ సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు.
అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పుపడుతుంది పుష్ప సినిమా డైలాగ్ ను కాదు దానిని ప్రదర్శించిన సందర్భాన్ని, కానీ వైసీపీ తన అతి తెలివితో పుష్ప గురించి మాట్లాడితేనే తప్పు, పుష్ప సినిమా డైలాగ్ చెప్పినందుకే అరెస్టు, గడ్డం ఇట్టంటే తప్పు, గడ్డం అట్టంటే తప్పు అంటూ తన అరాచకాన్ని పుష్ప సినిమా పై వివాదంగా మార్చాలని చూస్తుంది.
ఇక ఇప్పుడు ఈ రప్పా రప్పా నరకుడు పోస్టర్ తెలంగాణ రాజకీయాను తాకింది. నేడు సంగారెడ్డి జిన్నారంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో హరీష్ రావు ఫోటో ఉన్న ఫ్లెక్సీ పై “2028 లో రప్పా రప్పా 3.0″లోడింగ్ అంటూ పుష్ప చిత్రంలోని డైలాగ్ ప్రత్యక్షమయింది.
దీనితో అల్లు అర్జున్ మరో డైలాగ్ ఈడ ఉంటా ఆడ ఉంటా అన్నట్టుగా ఇటు ఏపీలో అటు తెలంగాణలో పుష్ప ఆన్ ఫెయిర్ అన్నట్టుగా రెండు రాష్ట్ర రాజకీయాలలో పుష్ప డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే ఇటు ఏపీలో వైసీపీ అటు తెలంగాణలో బిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పుష్ప డైలాగ్స్ తో అధికార పక్షానికి వార్నింగ్ కాల్స్ ఇస్తున్నారు.
అయితే ఇక్కడ వైసీపీ మెగా, అల్లు మధ్య ఉన్న అంతరాన్ని వైసీపీ రాజకీయంతో మరింత రాజేయాలని చూస్తుంటే, అక్కడ రేవంత్, బన్నీ మధ్య రాచుకున్న నిప్పు పై బిఆర్ఎస్ పెట్రోల్ వేయాలని ప్రయత్నిస్తుంది.




