రాయలసీమ రాజధాని అనలేదు కానీ…

Rayalaseema development with semiconductor industry and infrastructure growth in Andhra Pradesh

రెండుసార్లు దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎప్పటికైనా కొలుకుంటుందా? అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందేవారు. దేశంలోని మేధావులు, ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులలో కూడా అటువంటి అనుమానాలే ఉండేవి. కానీ రెండుసార్లూ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలిపారు. ఇంకా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకువస్తూనే ఉన్నారు.

కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన ఈ సమయంలో రప్పా రప్పాల గురించి అమరావతికి వ్యతిరేకంగా వారు చేస్తున్న దుష్ప్రచారం గురించి, పరిశ్రమలు, ఐటి కంపెనీల విషయంలో వారు చేస్తున్న రాద్దాంతం గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా బాధాకరమే. కానీ వాసుదేవుడు అంతటి వాడికే తప్పలేదన్నట్లు ముందుకు సాగిపోవాల్సిందే.

ADVERTISEMENT

ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాననలేదు. కానీ రాయలసీమని మళ్ళీ రత్నాలసీమగా మార్చేందుకు ఏమేమి చేయగలరో అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఓ పక్క కరువు పీడిత రాయలసీమకు నీళ్ళు అందిస్తూనే, అనేక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు.

తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో చిలమత్తూరు మండలంలోని టేకులోడు వద్ద రూ.3,267.69 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ సంస్థ సెమీ కండక్టర్ పరిశ్రమని ఏర్పాటు చేయబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ 30 ఎకరాలు కేటాయించింది.

రాబోయే రెండేళ్లలో తొలిదశ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి మొదలుపెడతామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండో దశలో మరో రూ.6,972.90 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ విస్తరిస్తామని చెప్పారు. దీనిలో ప్రత్యక్షంగా 1,017 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరో స్పేస్, డ్రోన్, డిఫెన్స్ రంగాలలో పెట్టుబడులు, పరిశ్రమలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసింది. తత్ఫలితంగా జిల్లాలో ఈ మూడు రంగాలకు సంబందించిన పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పుడు తొలిసారిగా సెమీ కండక్టర్ కంపెనీ కూడా ఏర్పాటు కాబోతోంది. ఇవన్నీ ఏర్పాటు అయితే క్రమంగా రాయలసీమ రూపురేఖలే మారిపోతాయి.

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇరుగు పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి నుంచి సీమ జిల్లాలే ఇరుగు పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది? తాగు, సాగు నీరు సమస్య కూడా తీరిపోతే రాయలసీమ మళ్ళీ రత్నాలసీమగా మారకుండా ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories