కేసీఆర్‌పై తిరుగుబాటు మొదలైందా?

KCR

బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌లని ప్రశ్నించగలవారు లేరనే చెప్పొచ్చు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మెల్లగా అసమ్మతి గొంతులు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

“మా పార్టీలో నాకు ఎప్పుడూ గౌరవం లభించలేదు. ఎన్నికలలో నన్ను పక్కన పెట్టి వేరేవారికి టికెట్‌ ఇస్తే నేను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వరంగల్ జిల్లాలో ఇద్దరు అభ్యర్ధులను గెలిపించాను. అయినా మా అధిష్టానం పట్టించుకోలేదు. కనీసం స్థానిక పెద్దలు కూడా నన్ను పట్టించుకోలేదు.

ADVERTISEMENT

మా అధిష్టానం పెద్దలు కొందరు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం… ఆర్నెల్లో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిపోతారని చాలా అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు. ఇది తప్పు కదా?మనం అధికారంలో లేకపోతే ప్రజాప్రతినిధులుగా ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడవచ్చు కదా?వామపక్షాలు, మజ్లీస్‌, బీజేపీలు అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష పార్టీలుగా పనిచేస్తున్నాయి కదా?ఈ బెదిరింపులు, మా పార్టీ విధి విధానాలు, తీరుతెన్నులు సరికాదనిపిస్తోంది నాకు.

ఇదివరకు నేను కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళు ఉన్నాను. కనుక ఆ పార్టీలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరితో నాకు మంచి పరిచయాలున్నాయి. నా అనుచరులతో సంప్రదించి తగిన త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను,” అని తాటికొండ రాజయ్య చెప్పారు.

పార్టీని వీడేవారు అధిష్టానం మీద ఇటువంటి విమర్శలు చేయడం సహజమే కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి రావాలని కేసీఆర్‌ తహతహలాడుతున్నారని రాజయ్య చెప్పిన మాట ఆలోచింపజేస్తుంది.

ఎందుకంటే, ఇదివరకు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయంటూ తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్పించేసుకుని వాటిని నిర్వీర్యం చేసేశారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజలు ఎన్నుకున్న తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు పన్నుతోందంటూ, ముగ్గురు బీజేపీ పెద్దలను కేసీఆర్‌ ట్రాప్ చేసి అరెస్ట్ చేయించి నానా హడావుడి చేశారు.

కానీ ఇప్పుడు అదే కేసీఆర్‌, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నా ప్రజాస్వామ్యబద్దంగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి తహతహలాడుతున్నారు!

ఈవిషయం వేరెవరో చెపితే పెద్దగా పట్టించుకొనవసరం లేదు. కానీ కేసీఆర్‌ కుమారుడు, బిఆర్ఎస్ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కేసీఆర్‌ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ చెప్తున్నారు. ఆర్నెల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలిపోతుందని, కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. కనుక రాజయ్య చేసిన విమర్శలను తేలికగా కొట్టి పడేయలేము. తప్పు పట్టలేము కూడా!

ADVERTISEMENT
Latest Stories