ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా జోరుగా రాజకీయాలు మాత్రమే సాగుతుండటం విశేషం. బిఆర్ఎస్ పార్టీ నేతలు సిఎం రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన సలహాను తూచా తప్పకుండా పాటిస్తూ రాజకీయాలు చేస్తుండటమే విశేషం.
కొద్ది నెలల క్రితం సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ని ఉద్దేశ్యించి, “ఫామ్‌హౌస్‌లో కూర్చొని నా ప్రభుత్వాన్ని ఎలా కూల్చేసి అధికారం చేజిక్కించుకోవాలా అని కుట్రలు చేయడం కాదు. అధికారంలో లేనప్పుడు ఓ రాజకీయ పార్టీని ఏవిదంగా నడిపించాలో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకో.
ఆయన అధికారం కోల్పోయానని కోర్ పోలిటిక్స్ విడిచిపెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ నీలాగ ఇంట్లో కూర్చోలేదు. నిత్యం ప్రజల మద్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. నువ్వు కూడా ఆవిదంగా ప్రజల మద్యకు వెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం నా ప్రభుత్వంతో పోరాడితే నేను స్వాగతిస్తాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పిల్లకాకి రేవంత్ రెడ్డి సలహా నేను వినేదేమిటి? అని కేసీఆర్ అనుకున్నారో ఏమో కేసీఆర్ పట్టించుకోలేదు. నేటికీ ఫామ్‌హౌస్‌లో నుంచి అడుగు బయటపెట్టలేదు. ఎప్పుడొస్తారంటే 2025లో రిలీజ్ అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. అది వేరే విషయం.
కేసీఆర్ రేవంత్ రెడ్డి సలహాని పట్టించుకోకపోయినా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు మాత్రం బాగా వంటపట్టించుకున్నారు. ఇద్దరూ నిత్యం ప్రజల మద్యనే ఉంతున్నారు. ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలు, వైఫల్యాలు, తప్పిదాలు, అవినీతి, అక్రమాలు అన్నిటినీ ఎత్తిచూపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. బహుశః మరో ఏడాది పాటు వారిరువురూ ఇదేవిదంగా రాజకీయాలలో చురుకుగా ఉన్నట్లయితే, అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా బహుశః కేసీఆర్ కోసం ఎదురుచూడటం మానుకుంటారేమో?
ఊహించని విదంగా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని తమ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రజల్ దృష్టిలో దోషిగా నిలబెడుతుండటంతో, సిఎం రేవంత్ రెడ్డి కూడా వారికి చెక్ పెట్టడానికి అనేక కేసులు సిద్దం చేస్తున్నారు. నేడో రేపో కేటిఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నామనో లేదా కేసీఆర్‌కి నోటీసులు పంపించబోతున్నామో మీడియాకి లీకులు ఇస్తూ కేటీఆర్, హరీష్ రావులను కట్టడి చేస్తున్నారు.
ఈవిదంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య జోరుగా రాజకీయాలు సాగుతుంటే, ఈ రేసులో బీజేపీ వెనుకబడిపోతోందని గ్రహించిన బండి సంజయ్ తదితరులు మూసీ నిర్వాసితుల కోసం మూసీ నిద్రలు చేసి హడావుడి చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లని అరెస్ట్ చేస్తామని బెదిరించడమే తప్ప రేవంత్ రెడ్డికి వారిని అరెస్ట్ చేసే దమ్ము లేదని వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ బలపడకుండా అడ్డుకునేందుకు ఒకరినొకరు తిట్టుకుంటూ, కాపాడుకుంటూ గేమ్ ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
కేటీఆర్ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని విమర్శిస్తుంటే, కేసీఆర్, కేటీఆర్‌లు తమని తాము కాపాడుకునేందుకు మోడీతో రహస్య అవగాహన చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటారు. ఈవిదంగా తెలంగాణలో మంచి రసవత్తరమైన రాజకీయాలు జోరుగా సాగుతుంటే అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులనే మాటలు వినిపించడం తగ్గిపోయింది. ఇందుకు తెలంగాణ ప్రజలు సంతోషించాలా బాధపడాలా?




