కేసీఆర్‌ రహస్యాలు నాకు తెలుసు.. బిఆర్ఎస్ నేతలు వస్తే చెప్తా!

Revanth Reddy

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో నేడు సిఎం రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌-మోడీల మద్య ఎంత బలమైన బంధం ఉందో వివరిస్తూ గత పదేళ్ళలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రతీ బిల్లుకి కేసీఆర్‌ తన ఎంపీల చేత మద్దతు ఇస్తూనే ఉన్నారని, అవన్నీ పార్లమెంట్‌ రికార్డులలో భద్రంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలు, ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

అయితే కేసీఆర్‌ అన్ని విషయాలు తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలకు తెలియనీయరని చాలా విషయాలు దాచిపెడుతుంటారని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోడీతో భేటీలలో కేసీఆర్‌ ఏం మాట్లాడారనే విషయం బిఆర్ఎస్ పార్టీలో ఎవరికీ తెలియదని చెప్పారు.

కేసీఆర్‌-మోడీ బంధం ఎంతో బలమైనదో వివరిస్తూ, “ఒకానొక సమయంలో బిఆర్ఎస్ నేతలే ‘కేసీఆర్‌ మాకు వద్దు… కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయమని’ బహిరంగంగా అడిగేవారు. వారు మాట్లాడిన ఆ మాటలు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్‌లో వచ్చాయి కూడా. వారు చెప్పే విధానం వేరేగా ఉన్నా వారి ఉద్దేశ్యం మాత్రం కేసీఆర్‌ గద్దె దిగి కొడుకుని ఆ కుర్చీలో కూర్చోబెట్టమనే.

కేటీఆరే వారి చేత ఆవిధంగా అడిగించారా లేక వారే అడిగారో కానీ, కేసీఆర్‌ ఈ ఒత్తిడి భరించలేక ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసి నా కొడుకుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టడానికి సాయపడమని అడిగారు!ఈ విషయం ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బయటపెట్టారు!

బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో ఎవరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ కేసీఆర్‌ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని పర్మిషన్, సహకారం అడిగారంటే అర్దం ఏమిటి? బిఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోందనే కదా?బిఆర్ఎస్, బీజేపీల మద్య బలమైన ఫెవీకాల్ బంధం ఉండబట్టే కదా?

కేసీఆర్‌ గురించి మాకన్నీ తెలుసు. ఆయన మాకు అన్నీ చెపుతారని బిఆర్ఎస్ నేతలు భ్రమలో ఉంటారు. కానీ ఆయన వారికి కొన్నే చెప్తారు. చాలా విషయాలు దాచేస్తారు. కనుక కేసీఆర్‌ చెప్పని విషయాల గురించి బిఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా సందేహాలు ఉంటే నన్ను కలిస్తే అన్నీ వివరించి చెప్తాను. బిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతిధులకు కాంగ్రెస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories