తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రెండూ ఊహించలేనివే. ఆ షాక్ నుంచి తేరుకున్న కేసీఆర్, తమ పార్టీకి బ్రహ్మాస్త్రం వంటి ‘తెలంగాణ సెంటిమెంట్’తో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించి విజయం సాధించేందుకు సిద్దం అవుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను ఆ రివర్ బోర్డుకు అప్పగించేసి తెలంగాణకు తీరని నష్టం, తద్వారా ఏపీకి మేలు చేస్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందనే వాదనలతో కేసీఆర్ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనికోసం ఈ నెల 17న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. నల్గొండనే ఎందుకు ఎంచుకున్నారంటే, ఆ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ సమస్యతో బాధపడిన నల్గొండ జిల్లా వాసులను ఈ వాదనలతో ఒప్పించడం సులువని కేసీఆర్ భావించి ఉండవచ్చు.
అయితే కేసీఆర్ ఎత్తుగడని ముందే పసిగట్టిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నాలుగైదు రోజుల క్రితమే ప్రెస్‌మీట్ పెట్టి, కేసీఆర్ హయాంలోనే కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించేశారని, ఏపీ సిఎం జగన్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి రాయలసీమలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా ఉండిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పుడు కేసీఆర్ ‘తెలంగాణ సెంటిమెంట్’ను రాజేసి లోక్‌సభ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించిన సిఎం రేవంత్ రెడ్డి, నిన్న గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీని ఏవిదంగా ఎదుర్కోవాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. అందువల్లే మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కనుక ప్రజల దృష్టిని వీటిపై నుంచి మళ్ళించేందుకే, కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల పేరుతో సెంటిమెంట్ రాజేసేందుకు సిద్దమవుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యంగా నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో బిఆర్ఎస్ ఓడిపోయింది కనుక ఆ ప్రాంతాలలో ప్రజలను ఈపేరుతో రెచ్చగొట్టి లోక్‌సభ ఎన్నికలలో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
కనుక కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ అవినీతి, అక్రమాలు, చేసిన అప్పులు, మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోవడం మొదలైన అంశాల గురించి ప్రజలకు వివరించి, వారే బిఆర్ఎస్‌ని, కేసీఆర్‌ని తిరస్కరించేలా చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈసారి తెలంగాణలో ‘ఆంధ్రా’ ప్రమేయం లేకపోయినా, ఆంధ్రాకు పారే కృష్ణా జలాల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్య యుద్ధం జరుగబోతోంది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి పార్టీ ప్రమాదంలో పడవచ్చు.




