రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ‘మా తెలుగు తల్లికి మంగళారతులు,’ వద్దనుకున్నారు. అలాగే ‘తెలుగు తల్లి’ మా తల్లి కాదంటూ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.
చివరికి తిరుమల శ్రీవారిని కూడా వద్దనుకొని యాదాద్రిని పునర్నిర్మించుకున్నారు. తిరుమల శ్రీవారికి ఏడు కొండలు ఉంటే యాదాద్రికి మరో రెండు కొండలు ఎక్కువే ఉండాలంటూ తొమ్మిది కొండలని ఖరారు చేశారు.
యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం ఒక్కటే ఉంటే ఏం బాగుంటుందని ఆలయ స్తంభంపై తన బొమ్మ కూడా చెక్కించుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవంనాడు దేశ ప్రధానులు మరీ ముఖ్యంగా… నరేంద్రమోడీ ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగురవేస్తున్నప్పుడు, కాబోయే ప్రధానిని తాను నేలపై ఎగురవేయడం ఏమిటనుకున్నారో ఏమో గోల్కొండ కోటపై జెండా ఎగరేసేవారు. ఇలా కేసీఆర్ గురించి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు.
అయితే అదంతా గత వైభవం! ఇప్పుడు చెప్పుకుంటే ‘మా తాతలు నేతులు తాగారనే’ నానుడి గుర్తువస్తుంది. కేసీఆర్‌కి ఆంధ్రా అంటే చాలా అసహ్యం కనుక మా తల్లి వేరు… మీ తల్లి వేరని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారని సరిపెట్టుకోవచ్చు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ (తెలంగాణ) తల్లి వేరు… మా తల్లి వేరు అని తెగేసి చెప్పేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన్నట్లు, కేసీఆర్ ఎంతో ముచ్చటపడి వేల కోట్ల ప్రజాధనంతో వాస్తు ప్రకారం కట్టించుకున్న ప్రగతి భవన్‌లో, సచివాలయంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులను వెంటబెట్టుకొని వెళ్ళి సెటిల్ అయిపోయినా బాధపడి ఉండరు.
కానీ రేవంత్ రెడ్డి ‘మీ తల్లి మీదే… మా తల్లి మాదే’ అంటూ వేరే రూపురేఖలతో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం తయారుచేయిస్తుండటం కేసీఆర్ జీర్ణించుకోవడం కష్టమే.
ప్రస్తుతం కూతురు కవిత హడావిడిలో ఉన్నారు కనుక ఈ తల్లుల విషయం గురించి ఇప్పుడేమీ మాట్లాడకపోవచ్చు. కానీ ఆ హడావుడి అయిపోతే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి సింహంలా గర్జించక మానరు.




