ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికి ఎవరైనా సినిమా తీస్తే మొదట్లో జనాలు చూసేవారు కానీ ఆ తర్వాత అటువంటి సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు. అవి ఆడవని తెలిసి ఉన్నప్పటికీ రాంగోపాల్ వర్మలాంటి దర్శకుల చేత అటువంటి సినిమాలు చేయించుకొంటూనే ఉన్నారు.
వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేందుకే వ్యూహం సినిమా తీస్తున్నానని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. వైసీపీకి వ్యూహాలు అలవాటు కనుక ఆ పార్టీ కోసం రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమా పేరు కూడా వ్యూహం అనే పెట్టి తీసి ఇవాళ్ళ టీజర్ వదిలారు. టీజర్ ప్రారంభం నుంచే తన టార్గెట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని తేల్చిచెప్పేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ పావురాలగుట్టలో కూలిపోపోయినట్లు చూపిన తర్వాత టీజర్‌లో మొట్టమొదట ఆయన కుటుంబాన్ని చూపిస్తారని ఆశించడం సహజం. కానీ చంద్రబాబు నాయుడుని ఆ తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రధారులను వరుసగా చూపారు.
అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని అక్రమస్తుల కేసులో ఇరికించడానికి కుట్రలు పన్నుతున్నట్లు చూపారు. ఇంకా షాకింగ్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దపడిన్నట్లు చూపారు.
ఆ తర్వాత జగన్ ఎలివేషన్, చివరిలో గేదెలను, పవన్ కళ్యాణ్‌ని చూపిస్తూ, చంద్రబాబు పాత్రధారితో ఓ చవుకబారు డైలాగ్‌తో టీజర్‌లో చెప్పదలచుకొన్నవన్నీ చెప్పేశారు.
జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు మీద పగతో రగిలిపోతూ ఆయన కట్టించిన ప్రజావేదికని కూల్చివేయడం, అమరావతిని పాడుబెట్టేయడం అందరికీ తెలుసు. కానీ రాంగోపాల్ వర్మ జగన్ మనసులోకి దూరిపోయి ఆయన ఇంకా ఎంత కసితో, పగతో రగిలిపోతున్నారో ఈ సినిమా ద్వారా చక్కగా చూపించారని చెప్పవచ్చు.
అయితే కోట్లు ఖర్చు పెట్టి పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నా కంటెంట్, కాన్సెప్ట్ నచ్చకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆదిపురుష్, భోళాశంకర్ ఇందుకు తాజా ఉదాహరణలు.
కనుక చిరంజీవి, పవన్ కళ్యాణ్, సోనియాగాంధీతో సహా వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులందరూ దుష్టులు, దుర్మార్గులు, నీచులని నిరూపించేందుకు ఇటువంటి వ్యూహం ఫన్నీ సినిమా తీస్తే జనాలు చూస్తారని చూసి టిడిపి, జనసేనలను చిత్తుచిత్తుగా ఓడించేస్తారనుకోవడం దురాశే అవుతుంది.
సినిమాలతో రాజకీయ పార్టీల గెలుపోటములను మార్చేయగలిగితే తెలుగు సినీ పరిశ్రమతో నేరుగా సంబంధాలున్న టిడిపి, జనసేనలు ఆ పని ఎప్పుడో చేసి అధికారం చేజిక్కించుకొనేవిగా?
చివరిగా ఒక్క మాట: పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో శ్యాంబాబు పేరుతో చిన్న డ్యాన్స్ చేయిస్తే అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలందరికీ చాలా కోపం వచ్చేసింది. నైతిక విలువల గురించి అనర్గళంగా మాట్లాడేశారు. కానీ రాంగోపాల్ వర్మ తన వ్యూహంలో ఈ ముసుగులు… గుద్దులాటలు ఏవీ లేకుండా డైరెక్టుగా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ని తదితరులందరినీ చూపించేశారుగా?మరి ఇప్పుడు కూడా వైసీపీ నేతలు నైతిక విలువల గురించి మాట్లాడగలరా?



