మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా మొన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆమెతో బాటు ఎంపీ మిథున్ రెడ్డి తదితరులున్నారు. నగరిలో 600 ఏళ్ళ పురాతన ఆలయాన్ని కాపాడమని అభ్యర్ధించారు.
ఆమె నగరి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. మంత్రిగా ఉన్నప్పుడు తరచూ తిరుమలని, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి అధినేత జగన్మోహన్ రెడ్డిని దర్శించుకునేవారు. అప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ఆమె చక్రం తిప్పుతుండేవారు.
జగన్‌కు అత్యంత సన్నిహిత వైసీపీ నాయకులలో ఆమె కూడా ఒకరు. కనుక ఆమె ఒక్క మాట చెప్తే జగన్ వెంటనే మరమత్తులు చేయించేవారు. లేదా ఆయనే అప్పుడే నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆలయ పునరుద్దరణ చేయించేవారు కదా?
కానీ పదవి, అధికారం చేతిలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గం నగరిలోనే ఉన్న 600 ఏళ్ళ పురాతన ఆలయాన్ని రోజా పట్టించుకోలేదు. ఎందువల్ల? ఇప్పుడు దాని కోసం ఢిల్లీ వరకు వెళ్ళారు.. ఎందువల్ల?
ఆమెకు నిజంగానే ఆలయ పునరుద్దరణ చేయాలని ఉంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని అభ్యర్ధించవచ్చు. లేదా సనాతనధర్మాన్ని కాపాడాలనుకుంటున్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని కోరవచ్చు. లేదా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరవచ్చు. లేదా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ద్వారా ప్రభుత్వాన్ని కోరవచ్చు.
ఇలాంటి అభ్యర్ధనలని వారు కాదనరు. వారు తప్పకుండా ఆలయ పునరుద్దరణ చేయగలరు. ఇవేమీ వద్దనుకుంటే ఆమె సొంత డబ్బుతోనే ఆలయ పునరుద్దరణ చేయవచ్చు కదా?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణిలో దొంగతనాలు, శాలువాలలో చేతివాటం, టిటిడీలో అన్యమతస్థులను నియమించడం, తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు… ఒకటా రెండా అనేక అపచారాలు జరిగాయి.
కోట్లాది మంది హిందువులు ఆరాధ్యదైవం ఏడుకొండల శ్రీ వెంకటేశ్వరస్వామి పట్ల ఇన్ని అపచారాలు చేసినవారు నగరిలో 600 ఏళ్ళ పురాతన ఆలయం కోసం ఢిల్లీ వెళ్ళారంటే నమ్మశక్యంగా ఉందా?
పెరట్లో ఉన్న ఆవు కోసం ఊరంతా వెతికినట్లు దీని కోసం రోజా పనిగట్టుకొని ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశారంటే అనుమానించాల్సిన విషయమే. కేంద్ర మంత్రిని కలిసేందుకు బహుశః ఇదొక సాకు మాత్రమే కావచ్చు. ఆమె సొంత పని కోసమో లేదా జగన్ తరపునో రాయబారానికి వెళ్ళి ఉండవచ్చు. అది ఏమిటనేది కూటమి ప్రభుత్వమే కనుగొనాలి.
వైసీపీ ఏం చేసినా ప్రతీ దానికీ ఓ లెక్క ఉంటుంది. రోజా ఢిల్లీ పర్యటన కూడా అటువంటిదే కావచ్చు. కనుక కూటమి ప్రభుత్వం మేల్కోకపోతే ఆ తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.




