నగరి మాజీ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇప్పటికి తన నోటి దూలను వదులుకోలేకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మగాళ్లకు ఏమాత్రం తీసిపోను అంటూ కొడాలి నానితో సరిసమానంగా పోటీపడి మరి టీడీపీ, జనసేన లపై బూతులతో రెచ్చిపోయారు ఈ మహిళా నేత.
ఇక ఇప్పుడు పార్టీ ఘోర ఓటమికి తానూ కూడా ఒక కారణం అంటూ ఇంట బయట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ రోజా లో ఏమాత్రం మార్పు రాలేదు, పచ్చాత్తాపం కనిపించడంలేదు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటికి అద్దు అదుపు లేకుండా మాటవదిలిన ఎంతోమంది వైసీపీ శ్రేణులు ఆ తరువాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు, రాజకీయాలకు తాత్కాలిక విరామాలు ప్రకటించారు. చివరికి కొడాలి నాని సైతం పార్టీ ఓటమి తరువాత తన నోటికి తాళం వేసుకున్నారు.
కానీ రోజా నేటికీ అదే స్వరంతో ఇతరులను రెచ్చకొడుతూ రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా రోజా ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో జనసేన పవన్ కళ్యాణ్ గురించి ఆ పార్టీ క్యాడర్ గురించి మరోసారి నోరుపారేసుకున్నారు. పోటీ చేసిన 21 కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టిన జనసేన గెలుపుని ఒక గెలుపే కాదు అంటూ తూలనాడారు రోజా.
అలాగే ఆ పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి జెండా కూలీలు అంటూ మాట్లాడిన రోజా, ఇంత సిగ్గులేకుండా జెండా మోసే కూలీలను నేనెక్కడ చూడలా, వారి పార్టీ జెండా కాకుండా అన్ని పార్టీల జెండాలను మోసే ఈ కూలీల వలన కానీ ఆ జెండా అధినేత పవన్ వల్ల కానీ రాష్ట్రానికి కలిగిన మేలేంటి.?
పవన్ ప్యాకేజీ లు దండుకోవడానికి తప్ప జనసేన ఎవరికీ ఉపయోగం అంటూ మరోసారి ప్యాకేజీ అంటూ వైసీపీ పాత రాగం అందుకున్నారు రోజా. అయితే పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ + బీజేపీ జెండాలను కూడా మోస్తుంది, అలాగే ఆ పార్టీ నాయకులను సైతం తమ నేతలుగా భావిస్తుంది, ఇదంతా పొత్తులో భాగమే.
అయితే జనసేన జెండాతో పాటుగా ఇతర పార్టీల జెండాలను మోస్తున్నారు కాబట్టి రోజా జనసైనికులను జెండా కూలీలు అంటూ హేళన చేస్తుంది సరే, మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా జెండాలు మార్చే నాయకులను ఏమనాలి.?
రోజా మొదట్లో టీడీపీలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలి హోదాలో రాజకీయం నడిపింది, అపట్లో కాంగ్రెస్ పైన ప్రజారాజ్యం పైన విరుచుకుపడింది, ఇదే వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డిని నీచంగా మాట్లాడింది, హేళన చేసింది.
అలాగే మెగాస్టార్ చిరు ని సైతం కించపరిచేలా దూషణలు చేసింది. ఆ తరువాత టీడీపీ జెండా వదిలి రాజశేఖర్ రెడ్డి హయాంలో మిషన్ ఆకర్ష లో భాగంగా కాంగ్రెస్ జెండాలోకి మారించి. ఇక వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ జెండా ను పక్కన పెట్టి వైసీపీ జెండా భుజాన మోసింది.
ఇలా పూటకో జెండా మార్చే నేతలను రోజా భాషలో ఏమంటారో.? ఇలా రోజా పార్టీల జెండాలను మార్చడం వలన రాష్ట్రానికి జరిగిన మంచేమిటో.? రోజా జెండాలు మార్చడం వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏమైనా రెండుగా విడిపోకుండా ఆపగలిగిందా.? లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యలేమైనా పరిష్కరించబడ్డాయా.?
నగరి ఎమ్మెల్యే గా రోజా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రొయ్యల కూర, చేపల పులుసు పెట్టడం తప్ప నగరి అభివృద్ధికి చేసిందేమిటి.? రోజా తన ప్రవర్తనతో సొంత పార్టీలోనే వ్యతిరికతను మూటకట్టుకోవడం, తన నియోజకవర్గంలోనే పార్టీని మరింత బలహీన పరచడం తప్ప కనీసం పార్టీ బలోపేతం కోసం ఏమైనా చేసారా.?
పార్టీ కార్యకర్తలను ఇలా జెండా కూలీలు అంటూ అవహేళన చేయడం, పొత్తులో ఉన్న పార్టీల మధ్య చిచ్చు రేపడం కోసమే అవుతుంది. తమ రాజకీయ లబ్ది కోసం రోజుకో పార్టీ జెండా మార్చే స్వార్థపరులకంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్రపక్షాల జెండాలు మోసే ఈ జెండా కూలీలు మూడు జెండాల కూటమి పార్టీకి గట్టి పునాదులనే చెప్పాలి.
వైసీపీ పునాదులు కదల్చడంలో ఈ జెండా కూలీలు కూడా తమ వంతు పాత్ర పోషించారనే ఆక్రోషం రోజా ని ఈ స్థాయికి దిగజారుస్తుందా.? పార్టీ అధినేతల తో పోరాడలేక ఇలా చివరికి పార్టీ క్యాడర్ మీద తన అక్కసు చూపించడం అంతట రోజా పోరాట స్థాయి లీడర్ల నుంచి క్యాడర్ కి పడిందనుకోవాలా.?






