రద్దయిన నోట్లను మార్చుకోవడం కోసం నల్లకుభేరులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. పాత నోట్లను తరలించడానికి కంటైనర్లు, కార్లు, వ్యాన్ లను మాత్రమే వినియోగించిన బ్లాక్ మనీ రాయుళ్ళలో ఒక మెట్టు ఎదిగిన ఓ నల్లకుభేరుడు ఏకంగా విమానాన్నే వినియోగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. బీహార్‌లోని ముంగర్‌కి చెందిన అమర్ జిత్ కుమార్ సింగ్ అనే వ్యాపారవేత్త హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్ ఫ్లైట్ లో దాదాపు 5.5 కోట్ల విలువైన నోట్లను తరలిస్తుండగా, నాగాలాండ్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, సదరు మొత్తాన్ని సీజ్ చేసారు.
ఢిల్లీలోని నాగాలాండ్ వ్యాపారవేత్తకు అందించేందుకే ఈ నగదును తరలిస్తున్నట్టు అమర్ జీత్ సీఐఎస్ఎఫ్ అధికారులకు తెలిపారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే… నాగాలాండ్ లోని దిమాపూర్ లో స్వాధీనం చేసుకున్న సదరు మొత్తం సొమ్ము మాయమైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన సమాచారం మేరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు దాడులు నిర్వహించి ఈ సొమ్మును స్వాధీనం చేసుకుని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించిన కాసేపటికే సొమ్మంతా మాయమైంది.
అయితే ఆ సొమ్ము సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దే ఉండి ఉండొచ్చని స్థానిక ఇన్ కంట్యాక్స్ అధికారి అభిప్రాయపడ్డారు. అనుమానితులను అరెస్ట్ చేసే అధికారం తమకు లేకపోవడంతో సదరు సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు ఇచ్చినట్లుగా సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా సీజ్ చేసిన సొమ్ము మాయం కావడం ఒక విధంగా అధికారులకే షాకింగ్ గా మారింది. అది కూడా పాత 500, 1000 నోట్లు మాయం కావడంతో, దీని వెనుక ఏదో స్కాం ఉన్నట్లుగా అధికారులు అభిప్రాయ పడుతున్నారు.



