ముప్పావల కోడికి మూడు రూపాయల మసాలా.. తప్పదు!

Rushikonda palaces built by Jagan create ₹500 crore burden for AP government

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేసరికి అనేక సమస్యలు, సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. జగన్‌ తన కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో రుషికొండపై విలాసవంతంగా నిర్మించుకున్న ప్యాలస్‌లు కూడా వాటిలో ఒకటి.

కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఫర్నీచర్‌, గృహోపకరణాలతో నిండిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియక కూటమి ప్రభుత్వం గత 18 నెలలుగా తల పట్టుకుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రుల ఉపసంఘం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అంటే సమస్య తీవ్రత అర్ధమవుతుంది. వారు ఈ రంగంలో పేరు మోసిన హోటల్‌ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ADVERTISEMENT

వారి సూచనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్యాలస్‌లు నేరుగా ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ లేదా రిసార్ట్స్‌గా ఉపయోగించడానికి అనుకూలంగా లేవని స్పష్టమైంది. జగన్‌ తాను, తన కుటుంబం నివసించేందుకు అత్యంత విలాసంగా ఈ ప్యాలస్‌లను నిర్మించుకున్నారు. కానీ వాణిజ్యపరమైన వినియోగానికి అవి సరిపోవు.

అందుకే వాటి పక్కన లేదా పరిసర ప్రాంతాల్లో మరిన్ని భవనాలు నిర్మించి మొత్తం సముదాయాన్ని ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.

అంటే జగన్‌ ప్రభుత్వం రుషికొండపై పర్యాటక భవనాలను కూల్చేసి రూ.500 కోట్లు ఖర్చు చేసి ప్యాలస్‌లు నిర్మిస్తే, వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వం మరి కొన్ని కొత్త భవనాలు నిర్మించాలన్న మాట! వాటి కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయానికి ఇప్పటి ప్రభుత్వం ఈవిధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడమే విచిత్రం. ముప్పావల కోడికి మూడు రూపాయల మసాల అంటే ఇదేనేమో?

కానీ ప్రభుత్వానికి గుదిబండల్లా మారిన రుషికొండ ప్యాలస్‌ల నిర్వహణ భారం నుంచి బయటపడాలంటే మరో మార్గం లేదనే చెప్పాలి. కనుక నిపుణుల సలహా మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకొని అమలుచేయాల్సిందే. దాని కోసం అవసరమైతే మరో 500 కోట్లు ఖర్చు చేయక తప్పదు.

దీని కోసం విశాఖ మెట్రో రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు భూముల పరిశీలన చేయనున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్యాలస్‌ల పక్కనే లేదా కొండ మరో వైపున, లేక దిగువన కొత్త భవనాల నిర్మాణానికి వారు తగిన సిఫార్సులు చేస్తారు. వారి నివేదిక ఆధారంగా ఈ ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ADVERTISEMENT
Latest Stories