యుద్ధంలో కూడా అసమానతలేనా?

Russia-Ukraine War: Double Standards in Global Reactions

న్యాయదేవతకు అందరూ సమానమే అని మనం న్యాయశాస్త్రం చెపుతుంటే, డబ్బు, పదవి, అధికారం ఉన్నవాళ్ళకు కొన్ని మినహాయింపులు ఉంటాయని వాస్తవాలు చెపుతున్నాయి.

అయితే రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? అంటే అవుననే అంటోంది రష్యా. అవుననే అంటున్నాయి భారత్‌, అమెరికాలతో సహా పలు ప్రపంచదేశాలు!

ADVERTISEMENT

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు నాలుగేళ్ళు కావస్తోంది. ఈ నాలుగేళ్ళలో ఉక్రెయిన్ రాజధానితో పలు నగరాలను, పట్టణాలను నేలమట్టం చేసింది. చివరికి ఉక్రెయిన్ అధ్యక్షుడి నివాసంపై కూడా బాంబుల వర్షం కురిపించింది.

కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఎవరూ నచ్చజెప్పలేకపోతున్నారు. ఈ యుద్ధం కూడా ఆపేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్నారు. కానీ నేటికీ యుద్ధం కొనసాగూతూనే ఉంది.

డిసెంబర్ 28,29న రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఏకంగా 91 డ్రోన్లతో దాడులు జరిగాయి. వాటన్నిటినీ రష్యా దళాలు గాలిలోనే కూల్చేశాయి.

ఈ ఘటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ఈ దాడులని భారత్‌, అమెరికాలతో సహా పలు ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి రెచ్చగొట్టే పనులు శాంతి చర్చలకు ఆటంకం కలిగిస్తాయని, ఉక్రెయిన్‌ ఈవిధంగా చేసి ఉండకూడదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

అయితే పుతిన్ నివాసంపై తాము దాడులు చేయలేదని రష్యా దళాలే ఈ దాడుల డ్రామా ఆడుతూ ప్రపంచదేశాలను మభ్యపెడుతున్నాయని ఉక్రెయిన్ వాదిస్తోంది. రష్యాకు శాంతి చర్చలపై ఆసక్తి లేదు కనుకనే వాటికి విఘాతం కలిగించేందుకు ఈ కొత్త డ్రామా ఆడిందని ఉక్రెయిన్ వాదిస్తోంది.

అయితే ఉక్రెయిన్ ఈ దాడులు చేసిందా లేదా?అనేది పక్కన పెడితే, దాదాపు నాలుగేళ్ళుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూ ఆ దేశాన్ని నేలమట్టం చేస్తున్నా ఏ దేశమూ అడ్డుకోలేదు. రష్యా దళాలు ఉక్రెయిన్ అధ్యక్ష భవనంపై దాడులు చేసినా ఎవరికీ తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ లేదా మరొకరు దాడులు చేస్తే, భారత్‌తో సహా ప్రపంచ దేశాలు హడావుడిగా ఖండిస్తున్నాయి.

అంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేరు. అభ్యంతరాలు చెప్పలేరు. కానీ ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేస్తే, చేయకపోయినా కూడా హడావుడిగా మీడియాను పిలిచి ఖండిస్తుంటారు. అంటే యుద్ధంలో కూడా రెండు దేశాలు, అధ్యక్షులు, సైన్యాలు సమానమని అంగీకరించడం లేదనుకోవాలా?

ADVERTISEMENT
Latest Stories