ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధించి జైలుకి పంపించిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల మద్దతు ప్రకటించడం చాలా దురదృష్టకరం. పొరుగు రాష్ట్రంలో ఓ పార్టీకి ఆమె అధ్యక్షురాలు. కనుక ఆమె ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ అటువంటి నిర్ణయం తీసుకొనే ముందు తన సోదరుడిని వేదించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సబబా కాదా?అని ఆమె ఓ సారి ఆలోచించి ఉంటే బాగుండేది. అయినా పొరుగు రాష్ట్రంలో రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు. కనుక ఈ విషయంలో ఆమె విజ్ఞతకే విడిచిపెడుతున్నాము,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై అక్రమకేసులు నమోదు చేయించి వేదించిందని వాదించిన సజ్జలకు, తమ ప్రభుత్వం కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలను అదేవిదంగా వేదిస్తోందనే విషయం గుర్తు రాకపోవడం ఆశ్చర్యకరం.
జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలని, తల్లి విజయమ్మని ఆదరించి పార్టీలో సముచిత స్థానం కల్పించలేదనే విషయం కూడా సజ్జలకి గుర్తు రాలేదు. కల్పించి ఉండి ఉంటే వారు పొరుగు రాష్ట్రానికి వలస వెళ్ళవలసి వచ్చేదే కాదు. నేడు కాంగ్రెస్‌కి మద్దతు పలికేవారే కారు కదా?
జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, విజయమ్మ ఇద్దరూ కూడా వైసీపి చెల్లాచెదురు అయిపోకుండా కాపాడేందుకు ఎంతగానో శ్రమించారని సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ వారికి కృతజ్ఞత చూపకపోగా అవమానకరంగా పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి బయటకు సాగనంపామనే విషయం సజ్జలకి గుర్తురాలేదు.
వైఎస్ షర్మిల, విజయమ్మ తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని అష్టకష్టాలు పడుతూ, అవమానాలు ఎదుర్కొంటునప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వారిని వెనక్కు పిలిచి ఆదరించాలనుకోలేదు. కానీ వైఎస్ షర్మిల మాత్రం సోదరుడి పట్ల కృతజ్ఞతగా ఉండాలని సజ్జల కోరుకోవడం విడ్డూరంగా ఉంది.
నిజానికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి చాలా మహోపకారం చేశారని చెప్పవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి మేధావికి ఇంత చిన్న విషయం తెలియదనుకోగలమా?




