చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం వద్దంటే ఎలా?

Sajjala Ramakrishna Reddy Mangalagiri Police Station

రాజకీయాలలో ఉన్నవారు ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు తమ పదవీ అధికారం 5 ఏళ్ళే ఉంటాయని ఎలా మరిచిపోతారో తెలీదు కానీ అప్పుడు మరిచిపోయినందుకు తర్వాత తాపీగా మరో 5 ఏళ్ళు బాధలు పడుతుంటారు.

ADVERTISEMENT

రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనేమీ వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డిని, ఆ పార్టీ నేతలని వేధించలేదు. నిజం చెప్పాలంటే అప్పుడు కూడా వారే చంద్రబాబు నాయుడుని వేధించేవారు.

కానీ ఆయన రాజధాని అమరావతి, పోలవరం, పరిశ్రమలు, రాష్ట్రాభివృద్ధి అంటూ వైసీపి ఆగడాలను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అమరావతి నిర్మించి, రాష్ట్రాభివృద్ధి చేసి చూపిస్తే చాలు… వైసీపి తమని ఎన్నికలలో ఎదుర్కొని నిలబడలేదని గట్టిగా నమ్మేవారు.

కానీ ప్రజలు జగన్మాయలో చిక్కుకోవడంతో చంద్రబాబు నాయుడు, టిడిపి దెబ్బైపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ జోలికి రానప్పుడు, జగన్‌ కూడా అదే పద్దతిలో మూడు, నాలుగో అరడజనో రాజధానులు అంటూ, సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుకుంటూ ఓటు బ్యాంక్ నిర్మించుకుంటూ తన మానాన్న తాను పాలన చేసుకుని ఉంటే నేడు వైసీపి నేతలకి ఈ కేసులు, ఇటువంటి ఇబ్బందులు వచ్చేవే కావు.

కానీ జగన్‌ కూడా అచ్చం కేసీఆర్‌లాగే ఆలోచించి టిడిపిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేస్తేనే తనకు తిరుగు ఉండదని భావించారు.

ఆ క్రమంలో చేసిన కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు అందరూ చూశారు. ఆ దుష్టయజ్ఞంలో వైసీపిలో ప్రతీ ఒక్కరినీ భాగస్వాములుగా చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి కొందరు నేతలు చాలా ఉత్సాహంగా దానిలో పాల్గొన్నారు. అందుకు నేడు ప్రతీ ఒక్కరూ మూల్యం చెల్లిస్తున్నారు.

ఇంకా మూల్యం చెల్లించాల్సిన వారి జాబితా చాలా పెద్దదే ఉందంటూ టిడిపి శ్రేయోభిలాషులు చంద్రబాబు నాయుడుపై తెగ ఒత్తిడి చేస్తున్నా, ఈసారి అంతా ‘శాస్త్రోక్తంగానే’ చేద్దామని వారికి నచ్చజెపుతున్నారు.

మంగళగిరి టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నోటీస్‌ అందుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం చంద్రబాబు నాయుడు మాపై తప్పుడు కేసులతో రాజకీయకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబందమూ లేకపోయినా పోలీసులు నాపై కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై పెట్టిన ఈ తప్పుడు కేసులు ఉపసంహరించుకొని పరిపాలన, అభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలి,” అని అన్నారు.

గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలని జగన్‌ ప్రభుత్వం వేధిస్తున్నప్పుడు వారు ఇదే చెప్పేవారు. ఇప్పుడు సజ్జల ఆ మాటలను తిరిగి చెపుతున్నారు.

ఆనాడు జగన్‌ తాను సిఎం హోదాలో ఉన్నానని మరిచిన్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, రెండు పార్టీల నేతలను ఎంతగా అవహేళన చేశారో, ఎంతగా వేధించారో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ విన్నారు. కళ్ళారా చూశారు. జగన్‌ మెప్పుకోసమో, పదవులు, టికెట్స్ కోసమో వైసీపిలో చాలా మంది ఆయనని అనుకరించారు.

కనుక వారికి ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం కూడా వారి అర్దమయ్యే పద్దతిలోనే సమాధానం చెప్పాల్సివస్తోంది. ఇది ఖచ్చితంగా జగన్‌, వైసీపి నేతల స్వయంకృతాపరాధమే. కనుక ప్రాయశ్చిత్తం తప్పదు. కానీ వద్దనుకుంటే ఎలా?

ADVERTISEMENT
Latest Stories