2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయగాథలో అత్యంత ప్రేరణాత్మకమైన పాత్ర పోషించింది సంజు శాంసన్ . ఇటీవలే జట్టులో స్థానం కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అతడు, ఇంతలోనే భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారి ప్రపంచకప్‌ను రీటెయిన్ చేసుకోవటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రయాణం కేవలం క్రికెట్ కథ కాదు, ఓ ఆటగాడి ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలకు నిదర్శనం.
2026 ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సంజు కు అతడి కెరీర్ లో నే అత్యంత ఘోరమైన సిరీస్ గా మిగిలింది. సిరీస్ మొత్తం విఫలమవడంతో అతనిపై లెక్కలేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా నుంచి మాజీ ఆటగాళ్ల వరకూ చాలా మంది అతని స్థిరత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిభ ఉన్నా దాన్ని నిరూపించలేకపోతున్నాడనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.
ఆ విమర్శల ప్రభావం త్వరగానే జట్టులో కనిపించింది. టీమ్ కాంబినేషన్ మారడంతో సంజు శాంసన్ ప్లేయింగ్-11లో తన స్థానాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు భారత టీ20 జట్టులో కీలకంగా భావించిన ఆటగాడు బెంచ్‌పై కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దశలో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయిందని కూడా చాలామంది భావించారు.
అయితే క్రికెట్‌లో అవకాశాలు ఎప్పుడూ ఊహించని విధంగా వస్తాయి. జట్టులో భాగమయిన రింకు అత్యవసర పరిస్థితుల వల్ల జట్టును వదిలి వెళ్లిన కారణంగా సంజు కు వరల్డ్-కప్ లో అవకాశం వచ్చింది. ఈ అవకాశం అతని కెరీర్‌లో అత్యంత కీలకంగా మారింది. ఈసారి వచ్చిన అవకాశాన్ని వదలకుండా, తనివితీరా తన ప్రతిభ ను చుపించాలనుకున్నాడో ఏమో కానీ చరిత్రలో గుర్తుండిపోయే 3 ఇన్నింగ్స్ ను అందించాడు సంజు.
టోర్నీ లో భారత్ సెమిస్ ను చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సంజు తన లైఫ్-టైం బెస్ట్ ఇన్నింగ్స్ ను అందించి టీం ఇండియా ను దర్జాగా సెమిస్ కు పట్టుకెళ్ళాడు. విండీస్ పై 190+ ఛేదనలో 97 పరుగులు చేసి జట్టు సెమిస్ కు చేరటంతో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
సెమిస్ కు కారణమయ్యాడు అనే ఆలోచన అతనిలో కోసరంతైనా కనిపించలేదు. ఆరు నూరయినా ట్రోఫీ సాధించాల్సిందే అనే రీతిలో బ్యాటింగ్ చేసాడు సంజు. సెమీస్ లో కూడా తన ఫామ్ ను కొనసాగిస్తూ 89 పరుగులు చేసి టీం ఇండియా కు అద్భుతమైన స్కోరును అందించాడు.
ఒత్తిడితో నిండిన మ్యాచ్‌లో అతను ధైర్యంగా ఆడి భారత్‌కు ఆధిక్యం తీసుకొచ్చాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత సన్జూ సామ్సన్‌పై ఉన్న విమర్శలు ప్రశంసలుగా మారాయి. ఒకప్పుడు నిలకడ లేదని విమర్శించినవారే నాడు తన కన్సిస్టెన్సీ మరియు టెంపర్మెంట్ ను కొనియాడారు.
ఫైనల్ మ్యాచ్‌లో అతను చూపించిన ప్రదర్శన మాత్రం అతని కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలువనుంది. కీలక సమయంలో బాధ్యత తీసుకుని వేగంగా పరుగులు సాధించటమే కాక అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషించి భారత్‌ను భారీ స్కోర్ దిశగా పట్టుకెళ్ళాడు. ఆ ఇన్నింగ్స్ భారత జట్టుకు విజయానికి బలమైన పునాది వేసింది మరియు వరల్డ్ కప్ నెగ్గటంలో కీలక పాత్ర పోషించింది.
సంజు శాంసన్ కథ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప పునరాగమన కథగా నిలిచిపోతుంది. ప్లేయింగ్-11లో చోటు కోల్పోయిన ఆటగాడు, చివరకు ప్రపంచకప్ విజయానికి ప్రధాన కారణంగా మారడం చాలా అరుదైన విషయం. ఈ ప్రయాణం యువ క్రికెటర్లకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది — అవకాశాలు కోల్పోయినా ఆశ కోల్పోవద్దు; ఒక్క మంచి అవకాశం జీవితాన్ని మార్చగలదు.
ఇక వరల్డ్ కప్ జర్నీ ముగిసిన వేల, గతేడాది ఐపీఎల్-26 ఆక్షన్ కు ముందు జరిగిన ట్రేడ్ లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ ట్రేడ్ లో చెన్నై యాజమాన్యం జడ్డు ను బదులిచ్చినందున మొదట అభిమానులు చెన్నై యాజమాన్యాన్ని ట్రోల్స్ చేసారు. కానీ, నేటి సంజు ప్రదర్శనతో ప్రతి చెన్నై అభిమాని సంజు తమ జట్టుకు ఎలా ప్రదర్శిస్తాడో అని ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు..!







