ఏటా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ చాలా ఉత్సాహంగానే జరుగుతుంటుంది. ఈసారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం కూడా ఓ చేయి వేయడంతో ఇంకా భోగీ పండుగ కూడా జరుగక ముందే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు, పిండివంటలు, కోడి పందాలు, కొత్త సినిమాలు ఎలాగూ ఉంటాయి. పేకాటలు, మందుబాబుల చిందులు తప్పవు. ఇవి కాక ఎడ్ల పందాలు, ఈత పోటీలు, పడవ పందాలు, సాంప్రదాయ ఆటల పోటీలతో ఆంధ్రప్రదేశ్‌లో పల్లెల్లన్నీ చాలా కోలాహలంగా మారాయి.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ హడావుడి ఈసారి మామూలుగా లేదు. వీటన్నిటి గురించి సోషల్ మీడియాలో వార్తలు, ఫోటోలు, వీడియోలు వస్తుండటంతో ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలు కూడా గోదావరి జిల్లాలు చేరుకుంటున్నారు. ఈసారి తెలంగాణవాసులు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలను చూసేందుకు తరలివస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాలలో ఈ పండుగ హడావుడిని చూడాలంటే ఒకటి రెండు రోజులు బైకులు, కార్లు వేసుకొని తిరిగినా అన్నీ చూడలేము.
హైదరాబాద్‌కు చెందినా విహాగ్ అనే హెలీ సర్వీసుల సంస్థ దీనిలో గొప్ప వ్యాపారావకాశాన్ని చూసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు ‘హెలికాఫ్టర్ రైడ్’ అందుబాటులోకి తెస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ మైదానం నుంచి ఈ హెలీ రైడ్స్ నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
దీనిలో భాగంగా అంతర్వేది ఆలయం, సమీపంలో సముద్రంలో గోదావరి నది కలిసే ప్రదేశం, కోనసీమ జిల్లాలోని కొబ్బరితోటలు, పండుగ హడావుడి ఎక్కువగా ఉన్న ఊర్ల మీదుగా ఈ పర్యటన సుమారు 25 నిమిషాల సేపు సాగుతుంది. దీని కోసం ఒక్కొక్కరికీ రూ.5,000 ఛార్జిగా నిర్ణయించారు. రేపు భోగీ పండుగ రోజు నుంచే ఈ హెలికాఫ్టర్ సర్వీస్ అందుబాటులోకి ఉంటుంది. మీదే ఆలస్యం!






