ఏపీలో వైఎస్ షర్మిల, తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఇద్దరి పరిస్థితి ఇంచుమించు ఒకేలా కనిపిస్తోంది. ఇద్దరి ప్రయాణం కూడా ఒకలాగే సాగుతోంది. కానీ ఇద్దరూ పట్టువదలని విక్రమార్కుడులా బరిలో నిలబడి పోరాడుతూనే ఉన్నారు.
వీరిద్దరిలో షర్మిల కంటే కవిత భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆమె మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవచ్చు. లేదా బీఆర్ఎస్ పార్టీని చీల్చి సొంత పార్టీ పెట్టుకోవచ్చు. లేదా కేసీఆర్ కూతురుగా మంచి పేరుంది…తండ్రిలాగే మంచి మాటకారి. రాజకీయాలపై మంచి పట్టుంది. కనుక ఒకవేళ బీజేపి అధిష్టానం కేసీఆర్, కేటీఆర్‌లని వద్దనుకుంటే ఆమెను చేరదీయవచ్చు. కనుక కవితకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ షర్మిలకు ఎటువంటి ఆప్షన్స్ లేవు.
ఆమె వైసీపీలో చేరలేదు. ఒకవేళ అక్రమాస్తుల కేసు లేదా మరో కేసులో జగన్ జైలుకి వెళ్ళినా ఆమెకు పగ్గాలు అప్పగించేందుకు జగన్ సతీమణి భారతి అంగీకరించకపోవచ్చు. ఒకవేళ అప్పగించేందుకు సిద్దపడినా, జగన్ బయటకు వస్తే మళ్ళీ తాను బయటకు పంపించేస్తారని షర్మిల అందుకు అంగీకరించకపోవచ్చు.
ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి అప్పుడే రెండేళ్ళు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క వైసీపీ నేతనీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రప్పించలేకపోయారు. ఒకవేళ జగన్ జైలుకి వెళ్ళినా వైసీపీ నేతలెవరూ ప్రజాధరణ లేని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్టపడరు. కనుక ఆమె వైసీపీ నుంచి ఎవరినీ కాంగ్రెస్‌లోకి ఆకర్షించలేరని చెప్పవచ్చు.
ఏపీలో కూటమి మరింత బలపడుతోంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఇక ఎప్పటికీ చోటు లభించదు. కనుక ఆమె రాజకీయ కాలక్షేపం కోసమే ఏపీ కాంగ్రెస్ ఉపయోగపడుతుంది తప్ప ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె చేయగలిగేదేమీ ఉండదు. కనుక కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి రాజ్యసభ సీటు సంపాదించుకోగలిగితే అదే పదివేలు.






