ఏపీలో జగన్-షర్మిల స్ట్రీట్ ఫైట్స్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ముక్కుపై నుంచి ఆ వేలు తీసేలోగా తెలంగాణలో కేటీఆర్-కవితల మద్య ఫైట్ మొదలైంది.
అయితే కవిత ఆరోపణలు చేస్తుంటే కేటీఆర్ మౌనంగా ఉంటున్నారు కనుక ‘వార్ వన్ సైడ్’ అని చెప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ ఆమెను ఇంట్లో నుంచిగెంటేయగా, కేటీఆర్ ఆమెను పార్టీలో నుంచి బయటకు గెంటేశారు. ఆమె వారిపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కనుక వీరిది ‘హాట్ అండ్ కోల్డ్ వార్’ అని కూడా చెప్పుకోవచ్చు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాదు… ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ అన్నా-చెల్లెళ్ళ మద్య బంధాలు ఇలాగే ఉంటాయని బీహార్‌లో ఆర్‌జేడీ అధినేత తేజస్వీ యాదవ్- సోదరి రోహిణీ ఆచార్య నిరూపించి చూపారు.
బీహార్ ఎన్నికలలో ఎన్డీయే చేతిలో కాంగ్రెస్-ఆర్‌జేడీ కూటమి ఘోర పరాజయం చెందింది. అందుకు ఆమె అన్న తేజస్వీ యాదవ్, మరో ఇద్దరు ముఖ్య నేతలు బాధ్యతా వహించాలన్నారు. తమ తండ్రి లాలూ ప్రసాద్ స్థాపించిన పార్టీని తేజస్వీ యాదవ్ నాశనం చేసేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనందుకు తీవ్ర ఆవేదన, అసహనం, ఆగ్రహంతో రగిలిపోతున్న తేజస్వీ యాదవ్ చెల్లి విమర్శలపై మండిపడుతూ ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు.
దీంతో ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి “నేను పార్టీ ఓటమి గురించి ప్రశ్నించినందుకు నా అన్న నన్ను బూతులు తిట్టాడు. నన్ను కొట్టబోయాడు. చెప్పుతో కొడతానని బెదిరించాడు. నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి దారుణంగా అవమానించాడు.
పార్టీ ఓటమి గురించి అడిగినందుకు నన్ను అవమానించాడు సరే! కానీ యావత్ బీహార్ ప్రజలు, మీడియా అందరూ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు కదా? ఎంతమందిని తిడతారు… కొడతారు?నేను నా తండ్రి, అన్నల ఇంటిని, రాజకీయాలను కూడా వదిలేస్తున్నాను,” అన్నారు రోహిణీ ఆచార్య!
తెలంగాణలో కూడా అచ్చం అలాగే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కల్వకుంట్ల కవిత, తండ్రి కేసీఆర్‌ని, అన్న కేటీఆర్‌ని, బావ హరీష్ రావులను విమర్శించారు. దాంతో ఆమెను పార్టీలో నుంచి బహిష్కరించారు.
బీహార్ ఎన్నికలలో ఓడిపోయినందుకు రోహిణీ ఆచార్య అన్నని విమర్శిస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు కల్వకుంట్ల కవిత అన్నని, బావని విమర్శించారు. అంతా సేమ్ టూ సేమ్ స్టోరీ!
కానీ ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం, ఓటమి సమయంలో కూడా కలిసిమెలిసి ఉన్న జగన్, షర్మిల, విజయమ్మలు, భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత విడిపోయారు… అనే కంటే జగన్ తల్లిని, చెల్లిని బయటకు గెంటేశారని చెప్పవచ్చు. వారు కూడా రోడ్డున పడ్డారు.
కానీ తిరిగి వచ్చి మొదట ఆస్తుల కోసం, తర్వాత రాజకీయాలలో పోరాడుకుంటూనే ఉన్నారు. గెలుపు, ఓటమి తప్ప మిగిలిన స్టోరీ అంతా సేమ్ టూ సేమ్!






