పాపం వైసీపీలు… ఏటిలో పిసికిన చింత పండే!

Crowd holding signature banners beside neglected roads — symbolizing YSRCP’s signature drive amid public infrastructure neglect

ఓ రచయిత లేదా దర్శకుడుకి ఏదో మంచి పాయింట్ లభిస్తే దానినే మంచి కధ, సినిమాగా మలుస్తారు. అది ప్రేక్షకులకు నచ్చితే ఆదరించి సూపర్ హిట్ చేస్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ’ అనే ఓ పాయింట్ తట్టింది.

రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా?అన్నట్లు కోటి సంతకాలు ప్రోగ్రాం ప్రకటించేశారు. అయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘గడప గడపకి’ కార్యక్రమంలో పాల్గొనమని నెత్తీనోరు కొట్టుకున్నా వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు ఆయన కనుసైగ చేయగానే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చేసి ఇదేదో జాతీయ సమస్య అన్నట్లు కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. బహుశః దీంతో రాష్ట్రంలో ఎంత మంది ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో?

కానీ ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మదిలో మెదిలిన పాయింట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీస్తేనే ఆదరిస్తారు లేకుంటే లేదన్నట్లు, ఈ ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ’, కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం కూడా ప్రజలతో సంబంధం లేకుండా వైసీపీలో సొంత సినిమా అన్నట్లు సాగిపోతోంది.

ప్రజలు పట్టించుకోని ఈ కార్యక్రమం కోసం వైసీపీ నేతలు ఇంత సమయం కేటాయించి, ఇంతగా శ్రమించే బదులు అదేదో ప్రజలు కోరుకున్నదే చేస్తే ప్రయోజనం ఉండేది కదా?వారి కష్టానికి ఫలితం దక్కేది కదా?

రాష్ట్రంలో ఇదొక్కటే సమస్య కాదు. కోకోల్లలున్నాయి. నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లే ఉన్నాయి. పేరుకే ఫుట్‌పాత్‌లు కానీ చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. స్ట్రీట్ లైట్స్ వెలగవు. కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించడం లేదు. సముద్రతీర ప్రాంతాలు కోతకు గురవుతూనే ఉన్నాయి.

చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. రైతు బజార్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉంది.

ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్య ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా తమ అధినేత జగన్‌ బుర్రలో పుట్టిన ఆలోచనని అమలు చేయడానికి వైసీపీ నేతలు పోటీలు పడుతూ విలువైన సమయాన్ని, శ్రమని వృధా చేసుకుంటున్నారని చెప్పక తప్పదు. హడావుడిగా కత్తి పట్టుకొని బయలుదేరితే సరిపోదు. యుద్ధభూమి ఎక్కడ ఉందో ముందు తెలుసుకోవాలి కదా?

ADVERTISEMENT
Latest Stories