ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా రూపుదిద్దుకోవలసిన అమరావతిలో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన రహదారులు, భవనాలే తప్ప కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు… ఒక్క భవనం నిర్మించలేదు. కనీసం నిర్మాణంలో ఉన్నవాటిని కూడా పూర్తిచేయలేదు.
మూడు రాజధానులు అంటూ జగన్ ప్రభుత్వం మూడేళ్ళుగా కాలక్షేపం చేస్తుంటే, మందలించి రాజధాని పనులు వేగవంతం చేయవలసిన కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. కనుక ఈ పాపంలో వైసీపీ, బిజెపి, కేంద్ర ప్రభుత్వం మూడింటికీ సమాన బాధ్యత ఉంది.
రాజధాని విషయంలో వైసీపీ వైఖరి సరికానప్పటికీ దానికి పూర్తి స్పష్టత ఉందనే చెప్పవచ్చు. అది ఏనాడూ అమరావతిని రాజధానిగా అంగీకరించలేదు. నేటికీ మూడు రాజధానుల వైఖరికే కట్టుబడి ఉంది. ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకోకుండా అమరావతిని పాడుబెట్టినందుకు వైసీపీని ప్రజలు శిక్షిస్తారా లేదా సంక్షేమ పధకాల మాయలో పడి మళ్ళీ భుజానికి ఎత్తుకొని ఇక ఎప్పటికీ రాజధాని లేకుండా చేసుకొంటారా?అనేది ఎన్నికలొస్తే తెలుస్తుంది. కనుక అంతవరకు రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరించినా బాధపడి ప్రయోజనం ఉండదు.
కానీ అమరావతి విషయంలో మొసలి కన్నీళ్ళు కార్చుతూ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకొంటున్న బిజెపిని మాత్రం ఏపీ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని గ్రహించినట్లు లేదు. అందుకే గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ నేతృత్వంలో నేడు ‘మనం-మన అమరావతి’ పేరుతో ఉండవల్లి నుంచి రాజధాని గ్రామాలలో పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ రాష్ట్రాన్ని మోసం చేయలేదు. రాజధానిలో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్ ఓవర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నిర్మించబడ్డాయి. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కేంద్ర ఆర్ధిక పరిస్థితి కంటే చాలా బాగుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. అయినా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అప్పుల కోసం చీటికీ మాటికీ ఢిల్లీకి ఎందుకు పరిగెత్తుకువస్తున్నారు? అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారు?” అని ప్రశ్నించారు.
అక్కడ తెలంగాణలోనైనా.. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనైనా బీజేపీకి అధికారమే కావాలి తప్ప రాష్ట్రాల సమస్యలు పట్టవు… ప్రజల కష్టాలు.. వారి ఆకాంక్షలు అసలే పట్టవు. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళుగా మూడు రాజధానులు అంటూ అమరావతిని పాడుబెడుతున్నప్పుడు కేంద్రప్రభుత్వం గానీ రాష్ట్ర బీజేపీగానీ తప్పుపట్టలేదు కనీసం ప్రశ్నించలేదు.
ఒకవేళ కేంద్రప్రభుత్వం, బీజేపీలు అప్పుడే జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉండి ఉంటే ఈ పాటికి అమరావతి నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యి ఉండేవి. రాజధానికి ఓ రూపురేఖలు వచ్చి ఉండేవి. రాజధాని పనులు జోరుగా సాగుతుంటే దేశవిదేశాలకు చెందిన కంపెనీలు అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చి ఉండేవి.
కానీ వైసీపీ, బిజెపి, కేంద్ర ప్రభుత్వం మూడు కలిసి ఆడిన ఈ ఆటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు బలైపోయారు. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన బీజేపీ, వైసీపీలు ఇంకా ఇటువంటి కపట నాటకాలు ఆడుతున్నందున ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.



