దేవుళ్ళకి, మహనీయులకి కూడా కులాలు అంటగట్టేస్తే…

Srikrishnadevarayalu Statue Politics

ఓ పక్క గుంటూరులో అంగరంగ వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే, పక్కనే ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుపై కొన్ని వర్గాలు ఘర్షణ పడటం చాలా శోచనీయం.

పట్టణంలో కాపు సంఘం నాయకులు మూడు రోడ్ల పవర్ జంక్షన్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభ్యంతరం చెపుతూ, పక్కనే డా.అంబేద్కర్, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో పోలీసులు వారిని చెదరగొట్టి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ముసుగు వేశారు!

ADVERTISEMENT

తెలుగు భాషకు, సాహిత్యానికి పట్టం కట్టినవాడు శ్రీకృష్ణదేవరాయలు. పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అందుకు అందరూ సంతోషించాలి. కానీ అయనని కూడా కులం కోణంలో నుంచే చూడటం చాలా బాధాకరం.

పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, చివరికి దేవుళ్ళని కూడా కులాల వారీగా విభజించేసి పంచేసుకున్నారు.

యావత్ దేశ ప్రజలు గౌరవించే ఆ మహనీయులకు కులం, మతం, భాష, ప్రాంతం వంటివి ఆపాదిస్తూ వారిని కొందరికే పరిమితం చేసుకోవాలనువడం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం కాదా?

ఫలానా మహనీయుడు మా కులానికి చెందినవాడు అని చెప్పుకోవడం గర్వంగా అనిపించవచ్చు. కానీ ఈవిధంగా చేస్తుండటం వలన ఆ మహనీయుల గౌరవాన్ని మనమే తగ్గించేసుకుంటున్నామని ఎవరూ గ్రహించడం లేదు.

రాజకీయాల కోసమో లేదా ఊళ్ళో పరపతి చాటుకోవడం కోసమో లేదా మరో కారణం చేతో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటం వలననే ఈ విష సంస్కృతి నానాటికీ పెరుగుతోంది.

మహనీయులు దేశ ప్రజలందరినీ కలిపితే వారి పేరుతోనే ప్రజలు ఈవిధంగా కులాలు, మతాలు వారీగా విడిపోతుండటం చాలా బాధాకరం. వారి గొప్పదనం గుర్తించకపోగా ఈవిధంగా గొడవపడుతూ ఆ మహనీయులని అవమానించుకుంటున్నారు కూడా.

మహనీయుల విగ్రహాల ఏర్పాటుకి పోటీపడుతున్నవారు, వారి స్పూర్తిని విస్మరిస్తున్నారు. ఈ సంకుచిత ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు.

కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విగ్రహాల ఏర్పాటు విషయంలో ఉన్న నిర్దిష్టమైన చట్టాలు, విధానాలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలి.

ADVERTISEMENT
Latest Stories