సోషల్ మీడియా సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, పింట్రెస్ట్, టంబ్లర్ లను పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిలే అధికంగా ఉపయోగిస్తున్నారని తాజాగా వెలువడిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఇంటర్నెట్ వాడే వారిలో ఫేస్ బుక్ యూజర్లుగా ఉన్న పురుషుల శాతం 66గా ఉండగా, మహిళల శాతం 76గా ఉందని తాజాగా గణాంకాల ద్వారా తెలిసింది.
ఇక ట్విట్టర్ ని 18 శాతం మహిళలు, 17 శాతం పురుషులు వాడుతున్నారు. పింట్రెస్ట్, ఇన్ స్టాగ్రామ్ వంటి సైట్లకు పురుషులు కాస్త దూరంగానే ఉంటున్నారట. వీటికి అమ్మాయిల ఆదరణే ఎక్కువగా ఉందని తేలింది. అమెరికాలో సదరు సోషల్ మీడియా సైట్లకు యూజర్లుగా ఉన్న మహిళల సంఖ్య కోటికి చేరింది. అయితే ‘లింక్డ్ ఇన్’ సైట్ మాత్రం మేల్ యూజర్ల కన్నా అమ్మాయిలు తక్కువగా వాడుతున్నారట.
ప్రత్యేకించి భారత్ లో ఈ గణాంకాలు ఎలా ఉన్నాయో ఫేస్‌బుక్, ట్విట్టర్ పేర్కొనలేదు. అయితే ఇండియాలో వీటి వాడకంలో మహిళల శాతం పురుషుల కంటే తక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇండియాలో అమ్మాయిలు సోషల్ మీడియాను వాడుతున్న తీరు అంచనా వేయలేమని, సాంకేతిక అంశంలోనూ స్థానిక మహిళలపై వివక్ష ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు.



