వైసీపీ అధినేత జగన్ మహాద్భుతమనుకున్న వ్యూహాలన్నీ బెడిసి కొడుతూనే ఉంటాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై మత, శవ రాజకీయాలు చేయబోతే పోలీసులు, ఫోరెన్సిక్ నివేదిక, సీసీ ఫుటేజ్ వీడియో సాక్ష్యాధారాలతో సహా వివరాలు ప్రకటించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు.
తిరుమల గోశాల పేరుతో మత రాజకీయాలు చేయబోతే అదీ బెడిసి కొట్టింది. జగన్ ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా, రామగిరి మండలంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి హెలికాఫ్టర్‌లో వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో అద్దం పగిలింది.
అది పోలీసుల వైఫల్యమే అంటూ రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్‌ని ఉద్దేశించి జగన్ చాలా అనుచితంగా మాట్లాడారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు వైసీపీ కార్యకర్తలు జగన్‌ని ఫాలో అయిపోతూ, సుధాకర్ యాదవ్ ఓ పోలీస్ అధికారి అనే సంగతి మరిచి ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఒకవేళ జగన్ ఇంత హడావుడి చేయకుండా పరామర్శించి వెళ్ళిపోతే ఎటువంటి సమస్య ఉండేది కాదు. కానీ పోలీసుల వైఫల్యం వల్లనే హెలికాఫ్టర్ అద్దాలు పగిలాయని విమర్శించడంతో ప్రభుత్వం దీనిని సీరియస్‌గానే తీసుకుంది.
ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్, ఒకవేళ ఆ హెలికాఫ్టర్‌లో తిరుగు ప్రయాణం అయ్యి దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే అందరూ ప్రభుత్వాన్నే నిందిస్తారు కదా?అందుకే అ హెలికాఫ్టర్ పైలట్, కో పైలట్, హెలికాఫ్టర్ నిర్వహణ సంస్థకు నోటీసులు పంపి ఈ నెల 16న చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని కోరారు.
ఇక ఎస్సై సుధాకర్ యాదవ్ పిర్యాదు మేరకు ఆయనని ఫోన్లు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నవారిని గుర్తించి కేసు నమోదు చేసి నోటీస్ ఇస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఓదార్పు యాత్రలు చేసి వైసీపీ బలోపేతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరామర్శల పేరుతో శవరాజకీయాలతో రాజకీయ మైలేజ్ లభిస్తుందనుకుంటే ఈవిదంగా కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సజ్జల ఎలాగూ తిరిగి వచ్చేశారు కనుక ఇకపై ఆయనే కొత్త కొత్త వ్యూహాలు రచించి పెడతారు.




