మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఓ ఎంపీ, కేంద్రమంత్రిగా కంటే పేరున్న ప్రముఖ కాంట్రాక్టరుగా, కోటీశ్వరుడుగా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఆయన పెద్దగా కనబడటం లేదు కానీ ఒకప్పుడు నిత్యం మీడియాలో కనబడుతూనే ఉండేవారు. ముఖ్యంగా సినీ ప్రముఖులతో ఆయన ఫోటోలు, వీడియోలు కనిపించేవి. అది ఆయన బలహీనత కావచ్చు. కానీ దాని వలన ఎవరికీ ఇబ్బంది లేదు కనుక అందరూ చూసి సంతోషించేవారు.
ఏటా శివరాత్రికి విశాఖలోని ఆర్‌కే బీచ్ వద్ద కోటి శివలింగాలతో సెట్టింగ్ వేసి అభిషేకాలు చేస్తుండేవారు. అంత డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన ఆయనకు ఇప్పుడు వయసు మీద పడింది. కనుక అందం, అధికారం, ఐశ్వర్యం ఏవీ శాశ్వతం కావు కేవలం ఈశ్వర భక్తి మాత్రమే శాశ్వితం అని చెపుతున్నారిప్పుడు.
శివభక్తుడైన ఆయనకు ఈ జ్ఞానోదయం కలగడానికి ఇంత సమయం పట్టడమే విచిత్రం. కానీ కొసమెరుపు ఏమిటంటే, నేడు ఆయన శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఎప్పటిలాగే ఆయన చుట్టూ అనుచరగణం, మీడియా హడావుడి కనిపించింది.
పూజలు, ఆధ్యాత్మికత, ఆరాధన, దానధర్మాల వంటివన్నీ వ్యక్తిగతం. కొన్నిసార్లు సామాజికం కూడా కావచ్చు. కానీ ఓ దశకు చేరుకున్న తర్వాత అవన్నీ అంతరంగికంగా సాగిపోవాలి తప్ప ప్రచారం అవసరం లేదు. కానీ ప్రచారం జరుగుతోంది అంటే ఇంకా ఐహిక వాంఛల నుంచి బయటపడలేదనుకోవాలి.
సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునే పలువురు స్వామీజీలు తిరుమల లేదా మరో పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తమకు గౌరవ మర్యాదలు జరగాలని కోరుకోవడం లేదా మర్యాదలు జరుగలేదని బాధపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం చూసినప్పుడు, వారు కూడా ఇంకా పరిపక్వత సాధించలేదనిపిస్తుంది. కనుక మనుషులలో పరిపక్వత ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నకు నిర్దిష్టమైన సమాధానం లభించదు.





