రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ‘ఓటుకు నోటు’ కేసు అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కీలక మలుపు తీసుకుంది. తెలంగాణా ప్రభుత్వం ‘ఓటుకు నోటు’ అనగానే, ఏపీ సర్కార్ ‘ఫోన్ ట్యాపింగ్’ అంటూ చేసిన ఆరోపణ – ప్రత్యారోపణల నేపధ్యంలో… ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ఉన్న జురూసలెం మత్తయ్యను అరెస్ట్ చేయబోమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి అభయం ఇచ్చిన తర్వాతే, మత్తయ్య హైదరాబాద్ లో అడుగుపెట్టిన వైనం నాడు కలకలమే రేపింది.
అలాగే మరో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మత్తయ్య అరెస్ట్ కాబడి, వెనువెంటనే బయటకు రావడంతో ఇక ‘ఓటుకు నోటు’ కేసు కూడా నీరుగారిపోయిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేసాయి. దానికి తగిన విధంగానే అటు కేసీఆర్ సర్కార్ గానీ, ఇటు బాబు ప్రభుత్వం గానీ ఎలాంటి స్పందనలు లేకుండా వారి వారి విధులు నిర్వహించుకుంటున్నారు. అయితే మత్తయ్యను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇదే ‘కధ’లో అసలు మలుపు తిప్పినట్లుగా కనపడుతోంది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, మత్తయ్యతో పాటు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఏసీబీకీ కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని సదరు నోటీసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. దీంతో మలి విచారణలో ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయో లేక అంతా రొటీన్ గా సాగిపోతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.



