తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు రానున్నాయా? గ్రేటర్ విజయంతో బైపోల్స్ కు వెళ్లాలని పాలక పక్షం ప్లాన్ చేస్తోందా? కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఆయా నియోజక వర్గాల్లో ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా తిరుగుందని టీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీల తరఫున గెలిచిన వారిలో పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ కు చెందిన తలసాని శ్రీనివాస్, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి, సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ధర్మారెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు కె.యాదయ్య, రెడ్యానాయక్, కనకయ్య, విఠల్‌రెడ్డి, వైసీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, మదనలాల్ కూడా కారు ఎక్కిన వారి జాభితాలో వున్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండటంతో.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇదే అంశంపై గవర్నర్‌కు పలుసార్లు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు కూడా! ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ పై భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి బైపోల్స్ కు వెళ్లి విజయం సాధించాలనే వ్యూహంలో టీఆర్‌ఎస్ ఉన్నట్టు సమాచారం. వరంగల్ బైపోల్ లో భారీ మెజారిటీ రావడం ఒకటైతే, గ్రేటర్ హైదరాబాద్‌లో ఊహించని స్థానాలు రావడంపై పార్టీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే ఊపులో ఉప ఎన్నికలకు వెళ్తే విజయం ఖాయమని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.



