ఒకప్పుడు రాజకీయాలు అంటే మనకెందుకులే, ఆ సబ్జెక్టు మనకు అర్ధం కాదులే, మన సిలబస్ కాదులే, రాజకీయాలు అనేది సామాన్యుడికి సంబంధం లేని అంశం అనే ధోరణిలో ఉండేది. కానీ ప్రస్తుతం రాజకీయం అంటే చిన్న, పెద్ద ముసలి, ముతక అందరు చాల ఆసక్తిగా గమించే ఒక కీలక అంశంగా మారిపోయింది.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే ఈ రాజకీయాలు ఐపీఎల్ మ్యాచ్ ల కంటే రసవత్తరంగా, సినిమాల కంటే ఆసక్తి గాను సాగుతున్నాయని చెప్పాలి. అధికార పీఠం కాసేపు ఈ పార్టీ వర్గాన్ని ఊరిస్తుంటే మరికాసేపు ఆ పార్టీ వర్గాన్ని కవ్విస్తుంది అనేలా తమిళ రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తూన్నాయి.
ఎవ్వరు ఊహించని విధంగా విజయ్ టీవీకే 108 స్థానాలతో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ ఇప్పటికి సీఎం పదవికి అడుగు దూరంలోనే ఆగిపోయారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా రాజకీయ బద్దవిరోధులుగా చెలామణియైన డీఎంకే, అన్నాడీఎంకే పొత్తులో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నాయంటూ నిన్న రాత్రి వార్తలు గుప్పుమన్నాయి.
దీనితో అసలు తమినాట ఎం జరుగుతుంది.? ఎం జరగబోతుంది.? అంటూ అందరు తమిళ రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనించడం మొదలుపెట్టారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ తో రావాలని గవర్నర్ ఆదేశించడంతో ఏ నిముషం ఏ జరుగుతుంది.? అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
క్షణ క్షణం ఉత్కంఠ, వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు, ఏ పార్టీ అధికార పీఠాన్ని అందుకోబోతుంది? సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారం ఎప్పుడు.? విజయ్ టీవీకే మ్యాజిక్ ఫిగర్ అందుకేదెప్పుడు.? అందుకు ముందుకొచ్చే పార్టీలేమిటి.? ఇలా ప్రతి విషయంలోనూ తమిళ రాజకీయాలు సామాన్యుడి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతున్నాయి.
గతంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల విడుదల సందర్భంలో కూడా పార్టీల గెలుపులను, రాజకీయ నేతల ఓటములను ప్రజలు ఉత్సహంగా సెలబ్రేట్ చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. రోడ్ల మీదకొచ్చి, బాణసంచి కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ, కేక్ కటింగ్లు జరుపుకుంటూ ఇలా ఏపీలో కూటమి విజయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుని సామాన్యుడు సైతం సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇలా రాజకీయాలు మెల్లిమెల్లిగా ప్రజల జీవన సరళిలో భాగమైపోతున్నాయి.




