ఏపీ సిఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్రంలో టిడిపి కనబడకుండా తుడిచిపెట్టేయాలని ప్రయత్నించని రోజు లేదు… చేయని ప్రయత్నం లేదు. అయితే వేసవి ఎండలకి పూర్తిగా ఎండిపోయిందనుకొన్న గడ్డి మళ్ళీ రెండు చినుకులు పడగానే ఎలా పచ్చగా కళకళలాడుతూ విస్తరిస్తుందో, టిడిపి కూడా అలాగే మళ్ళీ పచ్చగా కళకళలాడుతోందిప్పుడు.
టిడిపిని దారుణంగా దెబ్బ తీసిన వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అది ఇంత త్వరగా కోలుకొనేందుకు అవకాశం కూడా కల్పించడం విశేషం. వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు, అవినీతి, చార్జీల పెంపు, వైసీపీ నేతల దాదాగిరీ వంటివి టిడిపికి ఆక్సిజన్ అందించి నిలబెట్టాయని చెప్పక తప్పదు.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిఎం పదవి చేపట్టగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేసి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే, టిడిపితో ఇంతగా పోరాడవలసిన అవసరమే ఉండేదే కాదు. కానీ జగన్ ప్రభుత్వం వరుసగా తప్పటడుగులు వేస్తూ టిడిపి మళ్ళీ పుంజుకొనేందుకు ఎంతగానో సాయపడి, టిడిపి మళ్ళీ పుంజుకొంది కనుక మళ్ళీ దానిని ఎదుర్కొనేందుకు సిద్దం అవుతుండటమే విచిత్రం.
అయితే టిడిపి ముఖ్యనేతలను దెబ్బ తీయడం కంటే ఏకంగా చంద్రబాబు నాయుడునే కోలుకోకుండా దెబ్బ తీయాలని ఆలోచనతో, అటక మీద నుంచి ఫైల్స్ దింపి దుమ్ము దులిపి వాటిలో బాబుని ఫిక్స్ చేసేందుకు ఏమైనా దొరుకుతాయేమోనని వెతకడం మొదలుపెట్టింది. దీనికోసమే ప్రత్యకంగా భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్‌గా శాసనసభ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ 2016-19 మద్యలో ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాల డాటా చోరీ అయ్యిందని నిర్ధారించింది. గత ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిందని, ప్రజల డేటా దొంగిలించి దాని సాయంతో రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను జాబితాలో నుంచి తొలగించిందని ప్రాధమికంగా నిర్ధారణ చేసింది. అవసరమైతే చంద్రబాబు నాయుడు, ఆయనకు సహకరించిన వారందరినీ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవలసి ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అంటే దీంతో చంద్రబాబు నాయుడుని రౌండప్ చేయాలని జగన్ ప్రభుత్వం సిద్దం అవుతోందని అర్దమవుతోంది. కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడుని దెబ్బ తీసేందుకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన జగన్ ప్రభుత్వం, ఈ ప్రయత్నంలో సఫలం అవుతుందా?అంటే కాదనే చెప్పవచ్చు. దీనిపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏమన్నారో వేరేగా చెప్పుకొందాము.



