పొత్తులకు ముందే టిడిపి, జనసేనలు సీట్లు కేటాయించేసుకొంటుంటే…

 TDP Jana Sena allocating seats before allianceటిడిపి, జనసేనలు పొత్తుల విషయంలో ఇంతవరకు స్పష్టత లేకపోవడం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం జనసేన, బిజెపితో కొనసాగుతుండగా, ఇటీవల పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తామని చెప్పారు. టిడిపితో బిజెపి పొత్తులు పెట్టుకోబోదని ఆ పార్టీ నేత సునీల్ ధియోరర్ ప్రకటించేశారు. జనసేనతో పొత్తులు కొనసాగుతాయని కూడా చెప్పారు. కనుక జనసేన బిజెపితో కొనసాగుతుందా లేక టిడిపితో పొత్తులు పెట్టుకొంటుందా అనే విషయం ముందుగా తేల్చుకోవడం చాలా అవసరం. అప్పుడే ఆ రెండు పార్టీల మద్య సీట్ల పంపకాలు చేసుకోగలవు.

కానీ ఈవిషయంపై స్పష్టత రాకమునుపే చంద్రబాబు నాయుడు సుమారు 27 నియోజకవర్గాలలో ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క పవన్‌ కళ్యాణ్‌పై కూడా జనసేన నాయకుల నుంచి ఒత్తిడి పెరిగిపోతుండటంతో మూడు నాలుగు చోట్ల దాదాపు అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నరసాపురం లోక్‌బహిరంగసభలో నియోజకవర్గం నుంచి మళ్ళీ తన సోదరుడు నాగబాబునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఆ నియోజకవర్గంలో వైసీపీ దూకుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని కనీసం పార్టీ బ్యానర్లు కూడా కట్టుకోనీయకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని జనసేన కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయగా ఇక నుంచి నరసాపురం నియోజకవర్గం బాధ్యతలను నాగబాబే చూసుకొంటారని చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేయబోతున్నట్లు స్పష్టమైంది.

గత ఎన్నికలలో టిడిపి, జనసేనల మద్య పొత్తులు లేకపోవడంతో నరసాపురం నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన శివరామరాజుకి 4.15 లక్షలు ఓట్లు రాగా జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన నాగబాబుకి 2.50 లక్షల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు 4,47,000కి ఓట్లు సాధించి గెలిచారు. ఒకవేళ నాగబాబు బరిలో లేకపోయుంటే ఆ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి శివరామరాజు తప్పక గెలిచేవారని అర్దమవుతోంది.

మళ్ళీ ఈసారి కూడా నాగబాబు అక్కడి నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయం అయిపోయింది. కనుక మళ్ళీ ఈసారి కూడా నరసాపురంలో అదే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయా? అనే సందేహం కలుగుతోంది.

కనుక టిడిపి, జనసేనలు పొత్తులు, సీట్ల పంపకాలపై మాట్లాడుకోకుండా ఈవిదంగా ఎవరికి వారు తమ తమ అభ్యర్ధులను ఖరారు చేసుకొంటూపోతూ, ఎన్నికలలో మళ్ళీ రెండూ పార్టీలు పోటీ పడితే ఈసారి కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. వైసీపీ సరిగ్గా ఇలాగే జరగాలని కోరుకొంటోంది కనుకనే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకుండా అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

మరి టిడిపి, జనసేనలు ఇంకా ఎప్పుడు చర్చలు ప్రారంభిస్తాయో… ఆలోగా ఇంకెంత మంది అభ్యర్ధులను ఖరారు చేసేస్తాయో? చివరికి ఏం జరుగుతుందో?వాటికే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories