డియర్ వారియర్స్ & జనసైనిక్స్…ఇంకెన్నాళ్లు.?

TDP and Jana Sena leaders urge unity

టీడీపీ, జనసేన రాజకీయ బంధం రాష్ట్రానికి ఎంత అవసరమో అని ఇరు పార్టీల అధినేతలు పదేపదే చెపుతున్నా ఆ పార్టీ కింద స్థాయి నేతలకు, క్యాడర్ కి ఇంకా అవగతం అవ్వడం లేదా.? కూటమి రాకతో రాష్ట్రంలో మారిన పరిస్థితులను ప్రచారం చేసుకోవాల్సిన స్థానంలో ఇరు పార్టీల శ్రేణులు అసలు పార్టీలకు సంబంధం లేని అంశాల మీద సోషల్ మీడియా లో యుద్దాలు చేస్తున్నారు.

వారి యుద్దాలు టీడీపీ, జనసేన రాజకీయ బంధాన్ని బలిపీఠం ఎక్కించే స్థాయికి చేరుకోవడంతో సయోధ్య కోసం స్వయంగా ఇరు పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఇరు పార్టీల సోషల్ మీడియా వార్ లపై టీడీపీ, జనసేన తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందించాయి.

ADVERTISEMENT

డియర్ సోషల్ మీడియా జనసైనిక్స్ & టీడీపీ వారియర్స్ అంటూ జనసేన….

డియర్ టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ & జనసైనిక్స్ అంటూ టీడీపీ….

తమ అధికారిక సోషల్ మీడియాలో ఇరు పార్టీల నేతలను కాస్త సంయమనం పాటించాలంటూ, ఇందులో ఇరుపార్టీల ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి వైసీపీ రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ ఇరు పార్టీ శ్రేణులకు కూటమి పొత్తు తాలూకా ఆవశ్యకతను మరోసారి తెలియచేశాయి టీడీపీ, జనసేన పార్టీలు.

అయితే పార్టీలు ఇలా తమ పార్టీ క్యాడర్ కి కింద స్థాయి నేతలకు దిశా నిర్దేశం చెయ్యడం తప్పుకాదు, కానీ ప్రతిసారి ఇలా పార్టీకి, ప్రభుత్వానికి అసలు సంబంధం లేని అంశాలను రాజకీయాలకు ముడిపెడుతూ ఒకరి మీద ఒకరు విమర్శనాబాణాలు ఎక్కుపెట్టుకుంటూ, ఒక పార్టీ టార్గెట్ గా మరోపార్టీ సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటూ వైసీపీ కి అవకాశం ఇవ్వడమే ఇక్కడ ఈ ఇరు పార్టీల శ్రేణులు చేస్తున్న పొరపాటు.

రెండు పార్టీల పునాదులు అటు సినీ రంగానికి సంబంధి ఉండడం ఇటు రాజకీయంగా పొత్తులో కలవడం టీడీపీ, జనసేన పార్టీలకు ప్రతిసారి ఒక ఉమ్మడి సమస్యగా మారుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం కలిసిన రెండు చేతులు, ఒక్కటైనా రెండు జెండాలు ఇప్పుడు ఇరు పార్టీ శ్రేణుల అర్ధంపర్ధం లేని ఆవేశాలతో అయోమయంలోకి వెళుతున్నాయి.

టీడీపీ ముసుగులో జనసేన ను టార్గెట్ చేస్తూ, జనసేన జెండా తో టీడీపీ ని విమర్శిస్తూ వైసీపీ ఇటువంటి ఐప్యాక్ వివాదాలు సృష్టిస్తుందని, ప్రత్యర్థి పార్టీల రాజకీయ వలలో చిక్కుకుని ఇరుపార్టీల నేతలు కూటమి బంధానికి విరుద్ధంగా సోషల్ మీడియాలో యుద్దాలు చేయొద్దంటూ జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత బాబు, మంత్రి లోకేష్ బహిరంగ వేదికల మీదే పలుమార్లు తమ తమ పార్టీ క్యాడర్ ని, మద్దతుదారులను హెచ్చరిస్తూనే వస్తున్నారు.

అయినా క్షేత్ర స్థాయి పరిస్థితులలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు అనేది ఇరుపార్టీల అధినేతల ఆవేదన. ఒకపక్క రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి కూటమి సై అంటుంటే వైసీపీ యుద్దానికి సిద్ధం అంటూ సవాల్ విసురుతుంటే మరోపక్క ఇలా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియా కేంద్రంగా యుద్దాలు చేసుకుంటూ ‘వారియర్స్’ టీడీపీ ని ‘సైనిక్స్’ జనసేనను ఇబ్బందులలోకి నెడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories