
తెలంగాణ బీజేపికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని బీజేపి అధిష్టానం ఎంపిక చేయబోతోంది. కానీ ఆనవాయితీ ప్రకారం ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడుని నియమించబోతోంది.
రేపు (ఆదివారం) ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి సోమవారం నామినేషన్స్ స్వీకరించి మంగళవారం (జూలై 1)న ఎన్నికలు నిర్వహిస్తామని బీజేపి ప్రకటించింది.
Also Read – జగన్ భావోద్వేగం నిజమా? లేక అవసరమా?
ఇంతకు ముందు బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని అందరూ భావించేలా చేశారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది.
బీజేపి అధిష్టానం చేసిన చారిత్రిక తప్పిదం అదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బీజేపి బద్ద శత్రువుగా పరిగణిస్తుంటుంది కనుక, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో దానిని అడ్డుకొని బిఆర్ఎస్ పార్టీకి తోడ్పపడేందుకే బీజేపి అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకుందనే వాదనలు బలంగా వినిపించాయి.
Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!
కనుక ఈసారి రాష్ట్రంలో పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు భావించవచ్చు. కానీ ఎప్పటిలాగే బీజేపి అధిష్టానం సూచించినవారు మాత్రమే నామినేషన్ వేస్తే, దీనిని ఎన్నిక అనలేము.. నామినేట్ చేసినట్లే అవుతుంది.
తెలంగాణ బీజేపి అధ్యక్ష పదవి చేపట్టేందుకు కిషన్ రెడ్డి అప్పుడే అయిష్టత వ్యక్తం చేశారు. కనుక ఆయన మళ్ళీ ఈ పదవి ఆశించకపోవచ్చు. అధ్యక్ష రేసులో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డికే అరుణ తదితరులున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తుందో మరో మూడు రోజులలో తేలిపోతుంది. ఈ ఎంపికని బట్టి తెలంగాణలో బీజేపి ఏవిదంగా ముందుకు సాగాలనుకుంటోందో స్పష్టమవుతుంది.