తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని సీఐడీ అధికారులు అధికారిక ప్రకటన వెలువరించారు. ప్రశ్నాపత్రం లీక్ తో 30 మంది వరకూ విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని, ఇప్పటివరకూ కేసుకు సంబంధించిన ముగ్గురిని (రమేష్ అనే బ్రోకర్ తో పాటు హైదరాబాద్ వ్యక్తి వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరొకరిని) అరెస్ట్ చేశామని తెలిపారు. పరీక్ష జరిగే సమయానికి రెండు రోజుల ముందు ప్రశ్నాపత్రాన్ని నిందితులు ఇచ్చారని నిర్ధారించారు.
విద్యార్థులను ముంబై, బెంగళూరు ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ముందుగానే ప్రిపేర్ చేయించి, పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్లకు చేర్చారని, ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నామని స్పష్టం చేశారు. లాభం పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఏపీ ఎంసెట్ లో విఫలమై, టీఎస్ ఎంసెట్ లో అనూహ్య ర్యాంకులు తెచ్చుకున్న 60 మంది విద్యార్ధుల ట్రాక్ట్ రికార్డును పరిశీలిస్తున్న సీఐడీ, వీరందరినీ విచారించాలని నిర్ణయించింది.



