రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హంగామా మొదలవుతోంది. ‘ప్రత్యేక హోదా’ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారడంతో, ఇప్పటికే ఏపీలో ఆ సెగ తగులుతోంది. ఇక తెలంగాణాలో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిత్య పాలనకు చరమగీతం పాడాలన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ అండ్ కో సిద్ధమవుతోంది. ఏపీ రాజకీయాలతో పోలిస్తే… తెలంగాణాలో రాజకీయాలు కాస్త స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు.
రాబోయే ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం దాదాపుగా ఖరారైన అంశంగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఇదే స్థాయిలో బజ్ ఉంటోంది. ఏపీలో అయితే ‘ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తుంది’ అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి అధికారంలో ఉన్న చంద్రబాబు వస్తారన్న టాక్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఓట్లు ఎటు చీలతాయి? ఎలా అనేది? ప్రశ్నార్ధకంగా మారింది.
పేపర్ మీద ఏపీ, తెలంగాణా రాజకీయాలు ఇలా కనపడుతున్నాయి గానీ, బ్యానర్ మీదయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరగేసారు. టీఆర్ఎస్ ప్రచార పర్వంలో భాగంగా పాతించిన కేసీఆర్ జెండాలలో ఒక జెండాను తిరగేసి కర్రకు కట్టగా, భూమిలో పాతిన వారు కూడా అది గమనించకపోవడంతో, ప్రస్తుతం సదరు పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీఆర్ఎస్ ప్రత్యర్ధి వర్గాలు మాత్రం రాబోయే ఎన్నికలకు ఇది నిదర్శమని కౌంటర్లు వేస్తున్నారు.



