
తెలంగాణలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీని ఎన్నికలలో ఢీకొనడమే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చాలా కష్టమనుకుంటే ఎన్నికలలో ఓడించి అధికారంలోకి రావడం ఇంకా పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గిన రేవంత్ రెడ్డి చాలా భారీ అంచనాలతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
కానీ ఎన్నికల హామీల అమలు సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వ నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా లేదని గ్రహించేసరికి షాక్ అయ్యారు. నెలకు రూ.18,000 కోట్లు ఆదాయం వస్తే దానిలో అప్పులు, వడ్డీలు, ఉద్యోగుల జీతాలకు పోగా కేవలం రూ.5,000-5,500 కోట్లు మాత్రమే మిగులుతోందని, దాంతోనే అతికష్టం మీద ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
కనుక ఈ ఆర్ధిక సమస్యల నుంచి తాత్కాలికంగానైనా బయటపడేందుకు హైదరాబాద్ నడిబొడ్డున కంచ గచ్చిబౌలిలో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాలు వేలం వేసి ఓ రూ.25-30,000 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నారు.
కానీ ఆ ప్రాంతంలో అనేక పచ్చటి చెట్లు, వాటిని ఆశ్రయించుకొని అనేక చిన్న చిన్న జంతువులు, నెమళ్ళు, పక్షులు ఉన్నాయి. కనుక అవి ప్రభుత్వ భూములే అయినప్పటికీ ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు అడ్డుపడ్డాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేశాయి.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
దీంతో ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం తీరుని తీవ్రంగా తప్పు పట్టడంతో సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట, ఆయన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.
సుప్రీం వ్యాఖ్యల వలన ప్రజలలో వ్యతిరేకత కూడా పెరుగుతోంది. కనుక దీనిపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు. ఇది ఈ సమస్య నుంచి ప్రభుత్వం గౌరవప్రదంగా బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నమే అని భావించవచ్చు.
Also Read – కేసీఆర్ హెచ్చరికలు రేవంత్ ను భయపెట్టగలవా.?
ఈ వివాదంలో బిఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరించినందున రాజకీయంగా ఆ పార్టీ కాంగ్రెస్‌పై పైచేయి సాధించగలిగింది.
మహాలక్ష్మి పధకం అమలు చేస్తున్నందుకు టిజిఎస్ ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి గురించి బిఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు కనుక ఎన్నికల హామీలు అమలుచేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తోంది.
మంత్రివర్గ విస్తరణ చేయకుండా తాత్సారం చేస్తున్న కారణంగా పార్టీలో ఆ పదవులు ఆశిస్తున్న సీనియర్లు సిఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర అసహనంతో ఉన్నారు. కనుక ఈ సమస్యల ఊబిలో నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న కొద్దీ ఇంకా లోలోనికి కూరుకుపోతూనే ఉంది తప్ప బయటపడే మార్గమే కనిపించడం లేదు.
పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక తిరుగులేదనుకుంటే ఇన్ని సమస్యలలో చిక్కుకోగా, వరుస ఓటములతో ఇక కోలుకోవడం కష్టమనుకున్న బిఆర్ఎస్ పార్టీ ఇంత వేగంగా పుంజుకోవడం రెండూ ఆశ్చర్యకరమే.