తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చావుదెబ్బ తిన్నప్పటికీ దాని పోరాటస్పూర్తి ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ చాలా చురుకుగా రాజకీయాలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎప్పటిలాగే చాలా బలంగా ఉందనే భావన పార్టీ శ్రేణులకు కల్పించగలుగుతున్నారు.
సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టడి చేసి తెలంగాణ తల్లి విగ్రహమే పెడతామని చెప్పించగలిగారు. తాజాగా పంట రుణాలు మాఫీ అంశంపై ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట రుణాలు మాఫీ కానీ రైతులను రోడ్లపైకి రప్పించి ఆందోళనలు చేయించగలుగుతున్నారు.
పంట రుణాలు మాఫీ విషయంలో రేవంత్ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేసి మాట తప్పి దేవుళ్ళని కూడా మోసం చేశారని, కనుక రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి తెలంగాణ ప్రజలని శిక్షించవద్దంటూ దేవుళ్ళని వేడుకోవడానికి అంటూ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ నేతలను వెంటేసుకొని గుళ్ళుగోపురాలలో హడావుడి చేస్తున్నారు.
ఇవాళ్ళ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని అందరూ రేవంత్ రెడ్డి చేసిన పాపాన్ని క్షమించాలంటూ పంతులుగారి ద్వారా స్వామివారికి విన్నవించుకున్నారు.
అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కౌంటర్ చూస్తే తెలంగాణ ప్రజలు సైతం నిజమే అని అనుకోక తప్పదు. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మీ మేనమామ చేసిన పాపాలను క్షమించమని కోరుతూ గుళ్ళు గోపురాలు తిరగలేదు ఎందుకు?
నాడు కేసీఆర్ పాపాల పల్లకి మోసిన నువ్వు, నేడు కేటీఆర్ పల్లకి ఎక్కడ మోయాల్సి వస్తదోనని తల్లడిల్లుతున్నావు. కేసీఆర్ పాపాలు పండి ఆ పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నేత పదవి పోతే.. నువ్వు ఆ కుర్చీని ఎక్కి, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయొచ్చని ఎదురుచూస్తున్నావు. అందుకే మీ మేనమామ చేసిన పాపాలకు పరిహారం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది,” అని ట్వీట్ చేస్తూ హరీష్ రావు ఫోటో పెట్టి ‘యాదాద్రి దేవాలయం సాక్షిగా మీరు అవినీతి చేయలేదని ప్రజలకు చెప్పగలరా?’ అని సవాలు కూడా విసిరింది.
కాంగ్రెస్ పెట్టిన ఆ పోస్ట్, ఆ ఫోటో రెండూ కూడా తెలంగాణ ప్రజలను చాలా ఆలోచింపజేయకుండా ఉండవు. కౌంటర్ అంటే ఇది కదా? అని అనుకోకుండా ఉండలేము.




