ఆశలు ఢిల్లీ కి చేరుతున్నాయి..మరి హామీలు.?

Telangana Congress Leaders Hopes Are Reaching Delhi

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాల పై వ్యతిరేకతతో, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలతో మీడియాలో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి తెలంగాణ రాజకీయాలు.

తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ ఇటు రాష్ట్ర నాయకత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా, అధిష్టానానికి కొత్త తలనొప్పులుగా మారనున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో కోకొల్లలుగా ఉంటారు. అందునా పదేళ్ల ప్రతిపక్షం తరువాత వచ్చిన అధికారం ఇక ఆ పార్టీలో ఆశావహులకు కొదవేముంటుంది.

ADVERTISEMENT

అందుచేత ఎవరి రాయబారాలు వారు చేస్తూనే ఉంటారు. అలాగే ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతూనే ఉంటారు. క్యాబినెట్ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి అవకాశం కావాలంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి.

గతంలో కూడా ఈ నియోజకవర్గం నుండి అనేకమంది ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు దక్కినందున ఈసారి కూడా రంగారెడ్డి జిల్లా నుండి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానానికి విన్నపాలు వినిపించారు మల్ రెడ్డి.

అందుకు గాను హస్తినకు చేరుకున్న మల్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి తన వినతులను విన్నవించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జానా రెడ్డి సైతం తనను ఎమ్మెల్సీ పదవి ద్వారా క్యాబినెట్ లోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసుకున్నారు.

అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ కూడా తాజాగా తనకు హోమ్ మంత్రి పదవి పై ఆశగా ఉందని, త్వరలో ఆ ఆశ తీరబోతుందంటూ తనకు ఓ మంత్రి పదవి కావాలంటూ రాష్ట్ర నాయకత్వానికి పరోక్ష సంకేతాలు పంపారు. ఇక అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న రాములమ్మ విజయశాంతి కూడా ఒక మంత్రి పదవి పై కన్నేసినట్టు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ అధిక మోతాదులో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఆశలు తీరాలన్న, ఎవరి అభీష్టాలు నెరవేరాలన్న అధిష్టానం ఆశీస్సులు తప్పనిసరి కావడంతో మంత్రి కావాలన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆశలన్నీ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కుతున్నాయి. మరి వారిలో పార్టీ పెద్దల హామీలు దక్కేదెవరికో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories