ఆకస్మిక తనిఖీలు అంటే తెలుగునాట గుర్తుకు వచ్చే ఏకైక పేరు నారా చంద్రబాబు నాయుడు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ అధికారులను ఉరుకులు పరుగులు గావించిన ఘనతను సొంతం చేసుకున్నారు బాబు. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ బాటనే ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే మంగళవారం నాడు అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ రోడ్లపైకి వచ్చారు.
కూకట్ పల్లి పరిధిలో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించిన మీదట, నాణ్యత ప్రమాణాలపై అధికారులపై మండిపడ్డారు. రోడ్డు పనుల పర్యవేక్షణకు స్వయంగా మంత్రివర్యులే రంగంలోకి దిగడంతో జీహెచ్ఎంసీ అధికారులు నానా హైరానా పడ్డారు. అప్పటికప్పుడు అర్ధరాత్రి సమయంలోనే ఉరుకులు పరుగులు పెడుతూ, మంత్రి గారు ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఇవేమీ పట్టించుకోని కేటీఆర్… పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస బాధ్యతలను విస్మరించిన కింది స్థాయి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇలా సమయం, సందర్భం మరియు అధికారులకు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అర్ధరాత్రి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. ఈ సమయంలో చాలా సేపు పనులను పరిశీలించిన తర్వాత వెళ్లిపోయారు కేటీఆర్. ఈ ఉదంతాలను చూసి గతంలో ఇలాగే సడెన్ సర్ ప్రైజ్ లిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తలచుకోవడం అధికారుల వంతయ్యింది. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అత్యంత కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పనితీరులో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.



