వృద్ధ తల్లితండ్రుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం సిద్ధం చేస్తోంది. పిల్లల నిరాధరణతో దయనీయంగా జీవిస్తున్న వృద్ధులైన తల్లితండ్రులకు సాయపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పదంతో ఇటువంటి చట్టం తీసుకు రాబోతుండటం చాలా అభినందనీయం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి బిల్లు సిద్ధం చేసింది. త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేస్తుంది. గవర్నర్ ఆమోదంతో ఇది చట్టరూపం దాల్చుతుంది.
ఈ చట్టం అమలులోకి వస్తే…
తల్లితండ్రులను చూసుకోని పరిస్థితుల్లో, వారి పిల్లల జీతం నుంచి 15 శాతం లేదా నెలకు రూ.10,000 లో ఏది తక్కువైతే అది నేరుగా తల్లితండ్రుల బ్యాంక్ ఖాతాలో జమా అవుతుంది.
దీని కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ప్రధాన కమిషనర్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్ లేదా ప్రభుత్వాధికారినియమిస్తుంది.
పిల్లల నిరాధరణకు గురైన తల్లితండ్రులు జిల్లా అధికారిని కలిసి తమ పరిస్థితిని వివరించాలి. వారి దరఖాస్తు ఆధారంగా వారి కుమారులు లేదా కుమార్తెలకు నోటీసులు జారీ చేస్తారు.
అప్పటికీ వారు స్వచ్ఛందంగా తల్లితండ్రుల బాధ్యత తీసుకోకపోతే, సదరు అధికారి వారు పని చేస్తున్న సంస్థతో సంప్రదించి వారి జీతం నుంచి నెలనెలా తల్లితండ్రుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.
జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో దరఖాస్తు అందిన 60 రోజుల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరు మరణిస్తే, ఆ మొత్తాన్ని జీవించి ఉన్న వ్యక్తికి చెల్లిస్తారు. ఇద్దరూ మరణించినట్లయితే, వారి డెత్ సర్టిఫికేట్ సమర్పిస్తే జీతంలో కోతను నిలిపివేస్తూ సంబంధిత సంస్థకు జిల్లా అధికారి ఆదేశాలు జారీ చేస్తారు.
ఇది అమలులోకి వస్తే దయనీయ జీవితాలు గడుపుతున్న వృద్ధ తల్లితండ్రులకు చాలా ఆసరాగా ఉంటుంది. కుటుంబ బాధ్యతను చట్టబద్ధం చేయాలనే ఆలోచన చాలా గొప్పది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచిస్తే బాగుంటుంది.
దీనిపై అధ్యయనం చేసి ఇలాంటి అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ కూడా వృద్ధుల నిరాధరణ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి.






