ఆ అస్త్రం కోసం కాంగ్రెస్‌తో కవిత పోటీ… !

Telangana New Political Weapon: BC Quota

ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నిర్వహించడం ఎంత కష్టమో, ఓ అంశాన్ని హైలైట్ చేసి దానితో రాజకీయ మైలేజ్ పొందడానికి కూడా అంతే కష్టపడాలి.

ఉదాహరణకు కేసీఆర్‌ ‘తెలంగాణ సెంటిమెంట్’ సృష్టించేందుకు సుమారు 25 ఏళ్ళు క్రితం పార్టీ పెట్టినప్పటి నుంచి శ్రమించారు. ఇప్పుడు దాని ఫలాలు బీఆర్ఎస్‌ పార్టీ అనుభవిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రత్యర్దులపై పైచేయి సాధించగలుగుతోంది.

ADVERTISEMENT

కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దానికి విరుగుడు కనిపెట్టాల్సి వచ్చింది. కనిపెట్టారు కూడా. అదే… బీసీ రిజర్వేషన్స్‌.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతం. అంటే వారి ఓట్లు ఎవరికీ పడితే వారిదే అధికారమన్న మాట.

కనుక రేవంత్ రెడ్డి బీసీలను ప్రసన్నం చేసుకొంటూనే, బీసీ రిజర్వేషన్స్‌ అస్త్రంతో ‘తెలంగాణ సెంటిమెంట్’ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.

బీసీలకు ఉపయోగపడాల్సిన రిజర్వేషన్స్‌ని ‘రాజకీయ అస్త్రం’ అని ఎందుకు అనాల్సివస్తోందంటే, దీని గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏమన్నారో వినాల్సి ఉంటుంది.

నేడు ఆమె హైదరాబాద్‌, ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీకి బీసీ రిజర్వేషన్స్‌పై నిబద్దత, చిత్తశుద్ది రెండూ లేవు. త్వరలో జరుగబోయే బీహార్‌ శాసనసభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ పార్టీ ధిల్లీలో మూడు రోజుల పాటు దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతోంది.

కానీ నేను తెలంగాణ బిడ్డగా బీసీ రిజర్వేషన్స్‌ కోసం ఆగస్ట్ 4,5,6 తేదీలలో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను. నా దీక్షలో నిజాయితీ, నిబద్దత ఉన్నాయి కనుక తప్పకుండా బీసీ రిజర్వేషన్స్‌ సాధించగలనని భావిస్తున్నాను,” అని అన్నారు.

అంటే కాంగ్రెస్‌ పార్టీ బిహార్ శాసనసభ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్స్‌ని రాజకీయ అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తొందని, కాంగ్రెస్‌కి పోటీగా ఆమె కూడా దీక్ష చేసి రాష్ట్రంలో బీసీలను అక్కట్టుకోవాలని తాపత్రయ పడుతున్నట్లు అర్ధమవుతోంది.

బీసీ రిజర్వేషన్స్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు “నా పోరాటాల వల్లనే కాంగ్రెస్‌ ఆర్డినెన్స్ జారీ చేస్తోందని, తద్వారా నేను రాజకీయంగా ఓ మెట్టు పైకి ఎక్కినట్లే భావిస్తున్నానని” కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పుకున్నారు. కనుక ఆమె కూడా దీనితో రాజకీయ మైలేజ్ పొందాలని తాపత్రయపడుతున్నారనే కదా అర్ధం!

అయితే కాంగ్రెస్‌వి ‘దొంగ దీక్షలు’ రాజకీయ లబ్ది కోసం చేస్తున్నావని కల్వకుంట్ల కవిత చెపుతున్నప్పుడు, మరి ఆమె చేసే దీక్షలు నిబద్దతతో కూడుకున్నవని ‘సెల్ఫ్ సర్టిఫై’ ఎలా చేసుకోగలరు?

కనుక రేవంత్ రెడ్డి కనిపెట్టిన ఈ ‘బీసీ రిజర్వేషన్స్‌’ అస్త్రం చేజిక్కించుకునేందుకు అప్పుడే పోటీలు మొదలయ్యాయన్న మాట!

బీఆర్ఎస్‌ పార్టీ వద్ద ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రం ఉంది. దానిపై సర్వహక్కులు ఆ పార్టీకి మాత్రమే ఉన్నాయి. కనుక దానిని కల్వకుంట్ల కవిత వాడుకోలేరు.

ఆ అస్త్రంతో బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో ‘బీసీ రిజర్వేషన్స్‌ అస్త్రాన్ని’ చేదించవచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిగా మారిన కల్వకుంట్ల కవిత వద్ద ఏ అస్త్రాలు లేవు.

కనుక బీసీ రిజర్వేషన్స్‌ అస్త్రంపై హక్కులు, క్రెడిట్ సంపాదించుకునేందుకు కాంగ్రెస్‌తో పోటీ పడక తప్పదు. అవసరమైతే కడుపు మాడ్చుకోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories